జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

By ramya neerukondaFirst Published Oct 27, 2018, 4:49 PM IST
Highlights

జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఫోన్ నుంచి 10 వేల కాల్స్‌ వెళ్లాయంటే దాడికి ఎంత ప్లాన్‌ జరిగిందో అర్ధమవుతోందని  ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ఆ పార్టీ నేత ఇక్బాల్ ఖండించారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఫోన్ నుంచి 10 వేల కాల్స్‌ వెళ్లాయంటే దాడికి ఎంత ప్లాన్‌ జరిగిందో అర్ధమవుతోందని  ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా హై ప్రొఫైల్‌ కేసు అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు మసి పూసి మారేడు కాయ చేస్తున్న సినీ నటుడు శివాజీని విచారించాలని డిమాండ్‌ చేశారు.

ఘటన జరిగినపుడు పోలీసులు అక్కడే ఉన్నారు కాబట్టి సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. స్థానిక పోలీసులు ఘటన జరిగినపుడు మీనమేషాలు లెక్కించారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారు కాబట్టి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. డీజీపీ కేసు టేక్‌ఓవర్‌ చేయకుండానే ప్రకటన చేయడాన్ని బట్టి అపోహలు, అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరు? కిరాయి హంతకుడా? అభిమాని ముసుగు వేసుకున్న దుండగుడా? అన్న వివరాలు పోలీసులు తెలుసుకోలేదని వివరించారు.

ఘటనకు పాల్పడిన శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని కాదని, టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. చంద్రబాబు దిగజారుడు మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. కుట్రదారులు ఎవరో బయట పెట్టాలని పోలీసులను కోరారు.

click me!