ప్రేమించి...పెళ్లాడి... తల్లిని చేసి... ఇప్పుడు వద్దుపొమ్మంటున్నాడు...: అత్తింటి ఎదుట మహిళ ఆందోళన

By Arun Kumar PFirst Published Jan 27, 2022, 3:49 PM IST
Highlights

ప్రేమించి పెళ్లాడిన వాడే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. 

అవనిగడ్డ: వెంటపడి మరీ ప్రేమించాడు... జీవితాంతం తోడుగా వుంటానని నమ్మించి పెళ్లిచేసుకున్నాడు... ఇద్దరు కవలలకు తల్లిని చేసాడు... ఇంత జరిగిన తర్వాత ఇప్పుడేమో నీతో కలిసి బ్రతకలేనంటూ వదిలించుకోవాలని చూస్తున్నాడట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న వాడి చేతిలోనే మోసపోయిన బాధిత మహిళ అత్తింటి ఎదుట మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా అవనిగడ్డ (avanigadda) కు చెందిన మణికంఠ వైష్ణవి అనే యువతిని ఏళ్లుగా ప్రేమించుకుని ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెళ్లయిన తర్వాత మణికంఠ అసలు రూపాన్ని బైటపెట్టాడు. నిత్యం వేధింపులకు దిగుతున్నా పుట్టింటికి వెళ్లలేక భరిస్తూ వుండిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరు కవలలు పుట్టారు. 

పిల్లలు పుట్టాకయినా భర్త మారడాతని వైష్ణవి భావించింది. కానీ అతడిలో ఏ మార్పు లేకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వేధింపులు భరించలేక కొన్నిరోజుల క్రితం వైష్ణవి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను రక్షించిన బంధువులు తమవెంట తీసుకునివెళ్లారు. 

అయితే పూర్తిగా కోలుకున్న వైష్ణవి తాజాగా పిల్లలతో కలిసి అత్తింటికి వెళ్లగా భర్త మణికంఠ బయటకు తోసేసాడు. అత్తింటివారు కూడా ఇంట్లోకి రానివ్వకుండా వైష్ణవితో పాటు ఆమె పిల్లలను అడ్డుకున్నారు. ఇంట్లోకి రానివ్వకుండా భయటకు పంపించారు. 

ఇలా దిక్కుతోచని పరిస్థితిలో వైష్ణవి మౌన పోరాటానికి దిగింది. తనతో పాటు ఇద్దరు బిడ్డలకు న్యాయం చేయాలంటూ చిన్నారులతో కలిసి భర్త ఇంటి ముందు కూర్చుని వైష్ణవి నిరసన తెలుపుతోంది. తనకు న్యాయం జరిగే వరకు నిరసనను విరమించేది లేదని ఆమె తేల్చిచెప్పింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న  పోలీసులు వైష్ణవి వద్దకు చేరుకుని వివరాలను తెలుసుకుంటున్నారు. ఆమెతో పాటు అత్తింటివారి నుండి వివరాలను సేకరిస్తున్నారు. బాధిత మహిళకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పై కూర్చుని ఆందోళనకు దిగిన ఘటన కొద్దిరోజుల క్రితం వేములవాడలో చోటుచేసుుకుంది. . తనకు, తన బిడ్డలకు భర్త, అత్తామామ నుండి రక్షణ కల్పించాలని బాధిత మహిళ పోలీసులను కోరుతూ పోలీస్ స్టేషన్ వద్దే నిరసన చేపట్టింది.  

రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండలం గైదిగుట్ట తండా కు చెందిన గుగులోతు మౌనికకు ఇద్దరు సంతానం. అయితే వరకట్నం కోసం అత్తింటివారి వేధింపులను తాళలేక పోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. అత్తామామ,భర్త నుండి వరకట్న వేధింపులు (dowry harassment) లేకుండా చూసి న్యాయం చేయాలని  తన పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది. 

గతంలోనూ ఇదే విషయమై భర్తతో గొడవ జరగ్గా పోలీస్టేషన్ లో పిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపింది. అయితే అంగవైకల్యంతో పుట్టిన పాపని చంపేస్తానని కూడా భర్త బెదిరిస్తున్నాడని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది. 

 మహిళ ఆందోళనపై ఎస్సై రాజుని వివరణ కోరగా గతంలోనే భార్యభర్తల గొడవపై కేసు నమోదు అయిందని తెలిపారు. ఇప్పుడు ఆ కేసుపై విచారణ కొనసాగుతోందని... కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని... ఇలా ఎవరికి వారు గొడవలు పెట్టుకోవద్దని ఎస్సై సూచించారు. 

click me!