
విజయవాడ: ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున విజయవాడ (vijayawada)లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పారిశుద్ద్య కార్మికురాలి ప్రాణాలను బలితీసుకుంది. అంతేకాదు మరో ఇద్దరు కార్మికులు కూడా ఈ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా సీరియస్ గా వున్నట్లు సమాచారం.
తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా వుంటుంది కాబట్టి నగరాలు, పట్టణాల్లో అదే సమయంలో పారిశుద్ద్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తుంటారు. ఇలాగే విజయవాడ పడమటలంక సమీపంలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పై ఇవాళ కొందరు కార్పోరేషన్ సిబ్బంది పారిశుద్ద్య పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు అతివేగంతో వీరిపైకి దూసుకువచ్చింది.
Video
చెత్తను తరలించే కార్పోరేషన్ వాహనాన్ని ఢీకొట్టి మరీ కార్మికులపైకి దూసుకెళ్లింది కారు. ఇలా అదుపుతప్పిన కారు ఢీకొట్టడంతో ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి తల భాగంలో తీవ్ర గాయమవగా మరొకరికి కాలు విరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గానే వున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పారిశుద్ద్య కార్మికురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే ఇదే కృష్ణా జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నూతన వధూవరులను హాస్పిటల్ పాలు చేసింది. పెళ్ళయి కేవలం కొన్ని గంటలు మాత్రమే గడివగా వధూవరులిద్దరూ ఇంకా పెళ్ళి బట్టల్లోనే వున్నారు. ఇలాంటి ఆనంద సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ నవదంపతులు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రివరకు భాజాభజంత్రీలు, బంధువుల సందడితో ఆనందం వెల్లివిరిసిన వధూవరుల ఇళ్లలో తెల్లవారేసరికి విషాద వాతావరణం ఏర్పడింది.
మచిలీపట్నంకు చెందిన ఆదిత్యకు కాకినాడకు చెందిన శ్రావణికి గత గురువారం రాత్రే వివాహమయ్యింది. కాకినాడలో అంగరంగవైభవంగా ఈ పెళ్లివేడుక జరిగింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య వధూవరులిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇలా రాత్రి కాకినాడలో పెళ్లితంతు ముగించుకుని నవ వధూవరులిద్దరూ బంధువులతో కలిసి కారులో మచిలీపట్నం బయలుదేరారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
తెల్లవారుజామున కారు గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు మండలం కౌతవరం వద్ద ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. మంచి వేగంతో వెళుతుండగా ఓ టర్నింగ్ వద్ద కారు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఓ చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులోని నూతన వధూవరులతో పాటు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.