జగన్ ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్: లోగుట్టు ఇదే...

By Nagaraju TFirst Published Nov 30, 2018, 8:09 PM IST
Highlights

రాజకీయాల్లో పార్టీల మధ్య పోరు మామలుగానే ఉంటుంది. ఒకపార్టీ ఒకటి అంటే నేనేమైనా తక్కువా అంటూ మరో పార్టీ నాలుగు అంటుంది. వాళ్లిద్దరూ అంటే నేను ఖాళీగా ఉన్నానా నేను అంటానంటూ మరోపార్టీ పది అంటుంది. ఇలా రాజకీయాల్లో ఒక పార్టీపై మరోపార్టీలు విమర్శలు చేసుకోవడం సహజం. 
 


కాకినాడ: రాజకీయాల్లో పార్టీల మధ్య పోరు మామలుగానే ఉంటుంది. ఒకపార్టీ ఒకటి అంటే నేనేమైనా తక్కువా అంటూ మరో పార్టీ నాలుగు అంటుంది. వాళ్లిద్దరూ అంటే నేను ఖాళీగా ఉన్నానా నేను అంటానంటూ మరోపార్టీ పది అంటుంది. ఇలా రాజకీయాల్లో ఒక పార్టీపై మరోపార్టీలు విమర్శలు చేసుకోవడం సహజం. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీల మధ్య పోరు కాస్త వ్యక్తిగత దూషణలకు వెళ్లిపోతుంది. ఒకప్పుడు వ్యక్తిగత దూషణలు అనేవి రాజకీయాల్లో కనిపించేవి కావు. అలాంటి రాజకీయాలను కూడా ప్రజలు అంగీకరించేవారు కాదు. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి పార్టీలు. 

ఒకప్పటి రాజకీయాలు ప్రస్తుతం లేవు అనుకోండి కానీ ఇప్పుడు పార్టీల్లో వ్యక్తిగత దూషణలే ప్రాచూర్యం పొందుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేతల మధ్య పోరు విమర్శల దాడి ఉందంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు కానీ ఏపీలో అంతకంటే ఘోరంగా విమర్శల దాడి జరుగుతుంది. 

ఐదు నెలల ముందుగానే మినీ ఎలక్షన్స్ తలించేలా పార్టీల మధ్య మాటల తూటాలు దీపావళి చిచ్చుబుడ్డిల్లా పేలుతున్నాయి. ఈ విమర్శల విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ ల మధ్య ప్రస్తుతం పొలిటికల్ వార్ నడుస్తోంది. 

గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఓ ప్రస్తావన తెచ్చారు. అది రాజకీయ కోణంలో విమర్శించారు. చంద్రబాబుకు మోదీతోనూ, పవన్ కళ్యాణ్ తోనూ ఇప్పుడు కాంగ్రెస్ తోనూ పెళ్లి అయ్యిందని విమర్శించారు. అలాగే వ్యక్తిగతంగా పవన్ పెళ్లిళ్ల గురించి కూడా ప్రస్తావించారు. 
 
జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా దుమారం రేపాయి. జనసేన పార్టీతోపాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా పవన్ చాలా  సహనం ప్రదర్శించారు. పెళ్లిళ్లు అనేవి ఏదో నా ఖర్మకాలి చేసుకోవాల్సి వచ్చింది అంటూ భావోద్వేగంగా వివరణ ఇచ్చారు.  

అందరిలా తాను ఉండలేనని అదే తనకు పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఏదో చెయ్యాలి సమాజానికి మంచి చెయ్యాలనే తపన ఉంటుందని అది అవతలి వాళ్లకు నచ్చనప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయంటూ చెప్పుకొచ్చారు. తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించిన జగన్ వాళ్ల ఆడవాళ్ల గురించి ప్రస్తావిస్తే ఎలా ఉంటుందని కానీ తాను అలా అననని చెప్పుకొచ్చారు. 

అలాంటి పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలకు పదును పెట్టారు. ఒకప్పుడు సహనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ పై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. హేతు బద్దకమైన రాజకీయాలు చెయ్యాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు.  

తూర్పుగోదావరి జిల్లా ప్రజాపోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. నువ్వు ఏం రెడ్డివి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. నీ మగతనం నిరూపించుకో అంటూ దూషిస్తున్నారు. 

నా వ్యక్తిగత విషయం జోలికి వచ్చినప్పుడు నడిరోడ్డుమీద నిలబెట్టి కొట్టగలను జగన్ అంటూ ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇంకా ముందుకెళ్తే జగన్ మోహన్ రెడ్డి నీ సీమాంధ్ర పౌరుషం చచ్చిందా అంటూ తిడుతూనే ఉన్నారు. జగన్ అధికారంలోకి వస్తే సినిమాలు మానేసి సాయుధ పోరాటం చేస్తానంటూ ప్రకటిస్తున్నారు. 

వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ ఇలా మాటలు తూలడానికి విమర్శలు దాడి చెయ్యడానికి కారణాలు లేకపోలేదు. అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందువల్లే పవన్ కళ్యాణ్ తన ప్రసంగం వాడిలో వేడిని పెంచుతూ జగన్ పై విమర్శల బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. 

జగన్ పై విమర్శలు చెయ్యడానికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికల్లో వైసీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం గ్రామ స్థాయి వరకు వెళ్లిపోయింది. 25 సీట్లు ఇచ్చేందుకు వైసీపీ అంగీకారం కూడా తెలిపిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

పొత్తుల వ్యహారం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైసీపీతో పొత్తు ఉందంటూ జరిగిన ప్రచారం పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని భావించిన పవన్ కళ్యాణ్ తన మాటలకు పదును పెట్టారు. వైసీపీతో పొత్తు ఉండదు అని చెప్పేందుకు జగన్ పై పవన్ కళ్యాణ్ తన విమర్శలు దాడి చేస్తున్నారు. 

ఘాటు విమర్శలు చేస్తేనే ప్రజలు నమ్ముతారని లేని పక్షంలో జగన్ తో పొత్తు నిజమేనని భావిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అందువల్ల వైసీపీని టార్గెట్ చేసిన దానికంటే నేరుగా జగన్ పైనే విమర్శలు ఎక్కిపెడితేనే ప్రజలు నమ్ముతారని పవన్ భావిస్తున్నారు. అందుకే జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అందువల్ల వైసీపీకి గండికొట్టేందుకు పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో తిష్టవేసిన పవన్ కళ్యాణ్ వైసీపీ మూలాలను కదిలించేపనిలో పడినట్లు టాక్. 

గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉభయగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించారు. వైఎస్ అంటే కాపు సామాజిక వర్గానికి విపరీతమైన అభిమానం. అయితే ఆ అభిమానం కాస్తో కూస్తో వైఎస్ జగన్ పై కూడా ఉంది. అందుకు నిదర్శనమే కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు జగన్ చుట్టూ ఉండటమే.

ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు పవన్ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాలలో గట్టిగా పాగా వేస్తే అత్యధిక స్థానాలు గెలవొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

ఉభయగోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం కనీసం 25 స్థానాలను ప్రభావితం చెయ్యగలరు. అందులోనూ కాపు ఓటర్లు కూడా అత్యధికంగా ఉన్న జిల్లాలు కూడా. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు దళిత ఓటర్లు కూడా ఉభయగోదావరి జిల్లాలలో అత్యధికంగానే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఆయన అభిమానుల నుంచి ఎదురైన పరిణామాల వల్ల చిరంజీవి పార్టీ ఒక సామాజిక వర్గానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో అలాంటి మచ్చ రాకుండా ఉండేందుకు కూడా పవన్ ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. 

కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఉద్యమం కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే పుట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు తనకు గుంపగుత్తగా పడతాయన్న నమ్మకం ఒకవైపు తాను ఒక సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాదని తెలిపేందుకు పవన్ టార్గెట్ జగన్ గా రెచ్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకువస్తానని చెప్తున్న జనసేనాని ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మగతనం, రోడ్డు మీదకు లాక్కొచ్చి కొడతా వంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో సరికాదంటుంది. మెుత్తానికి పవన్ టార్గెట్ జగన్ గా కీలక వ్యాఖ్యలు చేస్తుండటం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

click me!