విజయనగరం జిల్లాకు సైతం పాకిన కరోనా: తొలి పాజిటివ్ కేసు నమోదు

By telugu team  |  First Published May 6, 2020, 2:36 PM IST

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా కరోనా వైరస్ కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే, తాజాగా విజయనగరం జిల్లాలో ఓ కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఇక ఎంత మాత్రం కరోనా ఫ్రీ కాదు. విజయనగరం జిల్లాలో తొలి కరోనా  పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాలోని బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కిడ్నీ సమస్యతో బాధపడుతూ  విశాఖపట్నం వెళ్లిన ఆమెకు అక్కడ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

ఆమె కొడుకులు ద్వారా ఆమెకి కరోనా సోకినట్లు జిల్లా ఆరోగ్య శాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఎస్.వి. రమణ కుమారి తెెలిపారు. విజయనగరం జిల్లాలో వీళ్లంతా అన్ని చోట్లా తిరిగినట్లు సమాచారం. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Latest Videos

undefined

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,782 శాంపిల్స్ ను పరీక్షించగా 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1777కు చేరుకుంది. 

వారిలో 769 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 36 మంది మరణించారు. ప్రస్తుతం 1012 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా 533 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లా 363 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 14 కేసులు నమోదుయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 300 మార్కుకు చేరుకుంది. 

గత 24 గంటల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1 కేసు నమోదైంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 27 మంది కరోనా పాజిటివ్ బారిన బడ్డారు. ఇందులో 12 పాజిటివ్ కేసులు గుజరాత్ కు సంబంధించినవి.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. కృష్ణా జిల్లలో 10 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో 4గురు మరణించారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 80
చిత్తూరు 82
తూర్పు గోదావరి 46
గుంటూరు 363
కడప  90
కృష్ణా 300
కర్నూలు 533
నెల్లూరు 92
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 39
పశ్చిమ గోదావరి 59

click me!