గ్యాస్ లీకేజీ దుర్ఘటన రోజే... జగన్ విశాఖకు రావడం ఆనందాన్నిచ్చింది: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published May 9, 2020, 2:01 PM IST
Highlights

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై స్పందిస్తూ మాజీ  మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డిఆర్ఎఫ్ ను అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి జగన్ విశాఖ రావడం ఆనందం కలిగించిందని... అయితే ఘటనా స్థలానికి వెళ్ళకుండా ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిపోవడం బాధ కలిగించిందన్నారు. 

తన రాజకీయ అనుభవంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు అచ్చెన్నాయుడు. ''విశాఖ పర్యటనలో జగన్ వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. కంపెనీ ప్రతినిధులతో ఎయిర్ పోర్ట్ లో మాట్లాడటం ఆ అనుమానాలకు బలం చేకూర్చుతుంది. ముఖ్యమంత్రి జగన్ కు కంపెనీపై ఉన్న ప్రేమ బాధితులపై లేదు'' అని ఆరోపించారు. 

''ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించడం అభినందనీయం. కాని దానిని మంత్రులు డబ్బా కొడుతున్నారు. ఆ స్థానంలో మానవతాదృక్ఫదం ఉన్న సాధారణ వ్యక్తులు కూడా ఇదే విధంగా పరిహారం ప్రకటిస్తారు. ఆ పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేక కంపెనీ యాజమాన్యం ఇస్తుందా చెప్పాలి. ఒకవేళ కంపెనీ ఇస్తే ఇది చాలా తక్కువ పరిహారం'' అని అన్నారు. 

''ఈ ఘటన జరిగిన 48 గంటల వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే వేలాది మంది రోడ్లపైకి ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలి. గ్యాస్ లీకేజీ బాధితుల తరపున మాట్లాడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదు'' అన్నారు అచ్చెన్నాయుడు.  

click me!