విశాఖ గ్యాస్ లీకేజీ : ప్రజల ప్రాణాలు కాపాడిన పబ్ జీ గేమ్!

By Sree sFirst Published May 8, 2020, 7:35 PM IST
Highlights

ఎల్.జీ. పాలిమర్స్ నుండి  విషవాయువు వెలువడ్డప్పుడు కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది ఎటువంటి సైరెన్ కూడా మోగించలేదు. అయినప్పటికీ చాల మంది ప్రజలు అక్కడి నుండి బయటపడగలిగారు. ఇందుకు కారణం పబ్ జీ గేమ్!

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించిన విషయం విదితమే! అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మరణించారు. 

ఇకపోతే ఈ ఎల్.జీ. పాలిమర్స్ నుండి  విషవాయువు వెలువడ్డప్పుడు కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది ఎటువంటి సైరెన్ కూడా మోగించలేదు. అయినప్పటికీ చాల మంది ప్రజలు అక్కడి నుండి బయటపడగలిగారు. భయాంతో అక్కడినుండి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ వైపుగా పరిగెత్తి ప్రాణాలను కాపాడుకోగలిగారు. 

ఇలా ప్రజలు తమ ప్రాణాలను కాపుడుకోవడానికి కారకులు కొందరు యువకులు. వారు అర్థరాత్రి రెండున్నర, మూడు గంటల మధ్య ప్రజల ఇండ్ల తలుపులు కొట్టి వారిని అప్రమత్తం చేసి అక్కడి నుండి బయటకు తీసుకువెళ్లగలిగారు. 

ఆ అర్థరాత్రి సమయంలో వారు ఎలా అందరిని అప్రమత్తం చేయగలిగారో తెలుసా...? పబ్ జీ వల్ల. అవునండి నిజమే! కిరణ్ అనే కుర్రాడు పబ్ జీ ఆడుతూ ఏదో వాసన వస్తున్నట్టుగా గుర్తించి సురేష్ అనే యువకుడికి ఫోన్ చేసి చెప్పాడు. 

కిరణ్ అనే యువకుడి ఇల్లు ఈ సదరు ఎల్.జీ పాలిమర్స్ కంపెనీని ఆనుకొనే ఉంటుంది. కిరణ్ మిత్రుడు సురేష్ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు. అలా సురేష్ అనే యువకుడు ఈ విషయం తెలుసుకోగానే ఇంటి నుండి బయటకు వచ్చి దట్టమైన పొగలాగా ఈ వాయువు కమ్ముకోవడం చూసాడు. వాసన కూడా వస్తుండడంతో అతడు మరికొంతమంది మిత్రులకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పాడు. 

ఇలా మిత్రులందరూ కలుసుకొని కంపెనీ సెక్యూరిటీ సిబ్బందిని ఏమైందని అడిగారు. అతడు గ్యాస్ లీక్ అయిందని చెప్పడం, ఇంతలోనే ఒక వీధి కుక్క రక్తం కక్కుకోవడం చూసిన వీరంతా వెంటనే గ్రామస్థులను అప్రమత్తం చేసారు. 1500 కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో దాదాపుగా 6000 జనాభా ఉంటుంది. 

సాధ్యమైనంత మందిని నిద్రలోంచి లేపి వారిని అప్రమత్తం చేసి రిజర్వాయర్ వైపుగా ఎత్తుగా ఉండే ప్రాంతానికి వెళ్లారు. ఇక అలా వెళ్తూనే వారు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఈ వాయువు వాసనను గుర్తించిన కిరణ్ మాత్రం ఈ వాయువును అధికంగా పీల్వడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఊరికే పనిపాట లేకుండా పబ్ జీ ఆడుతున్నారంటూ ఇన్ని రోజులెవరినైతే ఊర్లో వారంతా తిట్టారో... ఇప్పుడు ఆ తిట్టించుకున్న కుర్రాడు, ఆ తిట్లకు కారణమైన పబ్ జీ ఆటే వారి ప్రాణాలను కాపాడింది!

click me!