
తనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనను ఆయన చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఎంవీవీ ఆరోపించారు. పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదని, అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా అని ఎంపీ నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదని సత్యనారాయణ ప్రశ్నించారు.
తన మాటలను పవన్ వక్రీకరించారని, తాను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడు చెప్పలేదని ఎంపీ స్పష్టం చేశారు. తనను రాజీనామా చేయమనడానికి పవన్ కల్యాణ్ ఎవరు..? పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయారని, ఎంపీగా గెలిచిన తన గురించి మాట్లాడుతున్నారంటూ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో మాదిరిగా గంతులేస్తే నాయకులు కాలేరని.. వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కంటే కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్ అని.. దమ్ముంటే పవన్ మళ్లీ గాజువాకలో కానీ, తనపై కానీ పోటీ చేయాలని ఎంవీవీ సవాల్ విసిరారు.
ALso Read: పారిపోతానంటున్నావ్ .. ఎంపీవా, సిగ్గులేదు .. రాజీనామ్ చేయ్ : ఎంవీవీ సత్యనారాయణపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కూడా పవన్ కళ్యాణ్ కాపాడుకోలేకపోయారని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి అని చంద్రబాబుతో చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ప్రకటిస్తే తామంతా మద్ధతిస్తామని ఎంపీ పేర్కొన్నారు. పవన్‌కు దమ్ము, ధైర్యం వుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని ఎంవీవీ సవాల్ విసిరారు. కాపుల ఆత్మాభిమానాన్ని పవన్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని సత్యనారాయణ దుయ్యబట్టారు.