బెజవాడ కమీషనరేట్ ఉద్యోగి హత్య: మహేశ్‌‌ కారు లభ్యం, నిందితుల కోసం వేట

By Siva KodatiFirst Published Oct 11, 2020, 6:37 PM IST
Highlights

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహేశ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు పోలీసులు

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహేశ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. 6 ఎంఎం బుల్లెట్లు వాడినట్లు తేల్చారు.

మహేశ్‌పై మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం నిందితుల్లో ఒకరు మహేశ్ కారుతో పారిపోయారు. కొంతదూరం వెళ్లాకా దానిని ముస్తాబాద్ రోడ్డులో వదలి పరారైనట్లుగా తెలుస్తోంది. బుల్లెట్లను అలాగే కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరోవైపు నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఉద్యోగినే హతమార్చడం గన్‌కల్చర్ మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

హత్యకు రియల్ ఎస్టేట్ కారణాలా లేక కుటుంబ వివాదాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అమ్మాయి తరపు కుటుంబసభ్యుల నుంచి సఖ్యత ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న మహేష్‌పై గుర్తు తెలియని దుండగులు స్కూటీపై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఛాతీ, మెడలోకి బుల్లెట్లు దూసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.తుపాకీ కాల్పులతో భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగర్ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పాట్‌కి వచ్చి పరిశీలించారు. మహేష్‌ కదలికలపై రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు

click me!