దుర్గగుడిలో ఏసిబి దాడులు... 13మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

By Arun Kumar P  |  First Published Feb 23, 2021, 10:00 AM IST

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా అవినీతి, అక్రమాలు వెలుగు చూడటంతో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 


విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులపై వేటు పడింది. ఇటీవల మూడురోజుల పాటు ఆలయానికి సంబంధించిన వివిధ విభాగాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీబీ నివేదిక ఆధారంగా అధికారులపై సస్పెన్షన్ అదేశాలిచ్చారు దేవదాయశాఖ కమిషనర్ అర్జునరావు. 

మొత్తం 7 విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్ లు,8 మంది సిబ్బంది సస్పెండ్ అయ్యారు. అన్నదానం, టిక్కెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసిబి నివేదికలో పేర్కొంది. దీంతో స్టోర్స్, హౌస్ కీపింగ్, అన్నదానం, షాపుల లీజు, సూపర్ వైజింగ్ విభాగాల సూపరింటెండెంట్ లను సస్పెండ్ చేశారు. ఇక దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విభాగం, చీరలు, ఫోటోల విభాగంలోని మరికొందరు సిబ్బందిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. 

Latest Videos

undefined

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో చేపట్టిన ఏసిబి దాడుల్లో 300 రూపాయల టికెట్ కౌంటర్ తో పాటు లడ్డూ ప్రసాదాల కౌంటర్లలో అదనంగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కౌంటర్ల వద్ద స్టోర్స్ మరియు పలు విభాగాలలో కూడా సిబ్బందిని ప్రశ్నించారు. సుమారుగా 40 మంది అధికారులు ఈ తనిఖీలు నిర్వహించి వివిధ విభాగాల్లో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 

దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో అక్రమాలుపై దృష్టి సారించిన ఏసీబీ ప్రసాదాలు తయారీ, చీరల కౌంటర్లుతో పాటుగా వివిధ విబాగాలలో సోదాలు చేపట్టారు. వివిధ విభాగాల్లో పది ఏసిబి ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. టిక్కెట్లు కౌంటర్స్, సేల్స్ కౌంటర్ విక్రయ కేంద్రాలు, పరిపాలన విభాగం, స్టోర్స్ లో సోదాలు కొనసాగాయి. ఒక్కొక్క బృందంలో ఏసిబి అధికారితో పాటు విజిలెన్స్ అధికారులు, ఫుడ్ కంట్రోల్ బోర్డు సిబ్బంది వున్నారు. అర్చకుల వద్ద కూడా సోదాలు నిర్వహించిన ఏసిబి అధికారులు.

ఈ సోదాల ద్వారా దుర్గగుడిలో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఏసిబి గుర్తించింది. దీంతో ఈ అవినీతిపై ఓ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది ఏసిబి. ఈ నివేదిక ఆదారంగా సంంబంధిత అధికారులపై దేవాదాయశాఖ చర్యలు తీసుకుంది.  
 

click me!