మొత్తం 160...అంతర్వేదిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే సరిపోతుందా?: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Sep 11, 2020, 9:44 PM IST
Highlights

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ హిందువుల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు 160 వరకు జరిగాయని టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం వింతపోకడలకు పోతోందని... అధిక సంఖ్యాకులైన హైందవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ విధమైన పోకడలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఉదాసీనతగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం సాయంత్రం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ హిందువుల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు 160 వరకు జరిగాయన్నారు. ఈ దారుణాలను ఆపటానికి జగన్ సత్వరమే తీవ్ర ప్రయత్నాలు చేయాలని, అవసరమైతే అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని వర్ల సూచించారు. 

హైందవుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న ఘటనలతో రాష్ట్ర ప్రజల మనస్సులు అగ్నిగుండాల్లా ఉన్నాయని, అవి అగ్నిగోళాలుగా మారకముందే ముఖ్యమంత్రి తన భుజస్కంధాలపై ఉన్న బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలన్నారు.  వరుసగా జరుగుతున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినంత మాత్రాన ముఖ్యమంత్రి బాధ్యత తీరిపోయినట్లు కాదన్న వర్ల, అంతర్వేది రథం తగులబడిన ఘటనపై సీఎం ఎంత సీరియస్ గా ఉన్నాడో, ప్రభుత్వమిచ్చిన జీవోనే స్పష్టం చేస్తోందన్నారు. ప్రభుత్వ జీవోలో ఎక్కడా కూడా రథం దగ్ధం ఘటన కనీసం ఎలా జరిగిందో కూడా అనుమానం వ్యక్తంచేయలేదన్నారు.  

read more   

ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఘటనపై సక్రమంగా విచారణ చేయకుండా, సీబీఐ విచారణకు ఆదేశిస్తే సరిపోతుందా? అని వర్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న హైందవుల మనోభావాలను పట్టించుకోకుండా తూతూమంత్రంగా అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా జగన్ ప్రభుత్వం తాత్కాలికంగా ప్రజల ఆవేశాన్ని, ఆలోచనలను అణచివేసిందన్నారు. తన బాబాయి హత్యకేసు విచారణలా ఏళ్లతరబడి సాగదీయకుండా అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ వేగంగా జరిగేలా జగన్ చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేశారు. 

నాలుగువారాల్లో విచారణ పూర్తయ్యేలా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరాలని... అవసరమైతే కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలన్నారు.  అంతర్వేది ఘటనను నిరసిస్తూ 13వ తేదీ ఆదివారం నుంచి  శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రోజుకో దేవాలయం వద్ద పూజలు జరుపుతూ, నిరసన తెలియచేయాలని టీడీపీ తరుపున  హైందవులకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చామని వర్ల తెలిపారు. 

సింహాచలం దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు సహా రాష్ట్రంలో జరిగిన 160 సంఘటనలపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. సదరు దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా హిందూయేతర వ్యక్తిని ట్రస్ట్ బోర్డ్ ఛైర్ పర్సన్ గా నియమించారని రాష్ట్రమంతా కోడై కూస్తోందని, అన్యమతస్తులను తీసుకొచ్చి హిందువుల దేవాలయ బోర్డులో నియమించే అనాలోచిత చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సరికాదని వర్ల హితవు పలికారు.

click me!