శ్రీవారిని సేవించే అర్చకుడికీ కరోనా... మొత్తం 10 టిటిడి సిబ్బందికి పాజిటివ్

By Arun Kumar PFirst Published Jul 3, 2020, 10:26 AM IST
Highlights

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. 

తిరుమల: కలియుగ దైవం శ్రీవారి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులతో పాటు ఓ అర్చకుడికి కూడా కరోనా సోకినట్లు సమాచారం.  దీంతో టిటిడి ఉద్యోగుల్లోనే కాదు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే భక్తుల్లోనే ఆందోళన మొదలయ్యింది. 

ఇప్పటివరకు 10 మంది టీటీడీ సిబ్బంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో కలిసి పనిచేసిన ఉద్యోగులకూ కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. 

ఇలా రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు ఇది తీరా శ్రీవారి సన్నిధి వరకు పాకడంతో టిటిడి ముందస్తు జాగ్రత్తలకు సిద్దమైంది. టిటిడి సిబ్బంది నుంచి భక్తులకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించేందుకు ఎల్లుండి టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. 

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దైన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది.
 

click me!