Tirumala: తిరుమలలో కుండపోత వర్షంతో ఆలయంలో నిలిచిన వరద నీరు.. భక్తులకు ఇబ్బందులు

By Mahesh Rajamoni  |  First Published May 7, 2023, 4:05 AM IST

Tirumala: ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తిరుమ‌లలో భారీ వ‌ర్షం కురిసింది. వర్షానికి శ్రీవారి ఆలయం ఎదుట వరద నీరు చేరింది.  దీంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 
 


Heavy rain occurs in Tirumala: తిరుమలలో శనివారం కురిసిన భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, వర్షం నుంచి తమను తాము రక్షించుకునేందుకు షెడ్ల వైపు పరుగులు తీశారని సమాచారం. సుదీర్ఘ ఎండల తర్వాత అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కుండ‌పోత వ‌ర్షంతో ఆల‌యంలో వర‌ద నీరు చేరింది. దీంతో భ‌క్తులు ఇబ్బందులు ప‌డ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కుర‌వ‌డంతో పాటు పిడుగులు సైతం ప‌డే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) అధికార యంత్రాంగం తెలిపింది. భ‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌నీ, అధికారుల సూచ‌న‌లు పాటించాల‌ని పేర్కొంది.

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది ఆదివారం అల్పపీడనంగా మారి సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను ప్ర‌భావంతో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంద‌నీ, బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తాయ‌ని ఐఎండీ పేర్కొంది. ఆదివారం నుంచి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మార్కెట్ లో కానీ, వ్యవసాయ క్షేత్రంలో కానీ పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Latest Videos

undefined

మోచా తుఫాను.. హై అల‌ర్ట్ లో ఏపీ 

మోచా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మే 7 నుంచి మే 9 మధ్య మోచా తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ గతంలో పేర్కొంది. అందువల్ల రానున్న మూడు రోజుల పాటు తూర్పు కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గంటకు 30-4 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఏఎస్ఆర్, అనకాపల్లి, ఏలూరు, ఉభయగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆంధ్రప్రదేశ్ కు చేరడంతో వర్షాలు కురుస్తున్నాయి.

click me!