తిరుమల శ్రీవారికి కరెన్సీ కష్టాలు: వేతనాలకు కూడా లేని నగదు

By telugu teamFirst Published May 11, 2020, 7:57 AM IST
Highlights

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల ఆలయం ఇప్పుడు లక్ష్మీ కటాక్షం లేక చిక్కులను ఎదుర్కుంటోంది. ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి: సిబ్బందికి వేతనాలను చెల్లించడానికి, రోజువారీ వ్యయాలు భరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వద్ద తగిన నగదు లేదని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమలకు లాక్ డౌన్ కారణంగా ఆ కష్టాలు వచ్చాయి. 

లాక్ డౌన్ కాలంలో వేతనాలు, పింఛన్లు, ఇతర ఫిక్స్ డ్ ఖర్చుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. 8 టన్నుల బంగారు నిల్వలను, రూ.14 వేల కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను కదలించకుండా సమస్యను పరిష్కరించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

గత 50 రోజులుగా భక్తులకు తిరుమలేశుడి దర్శనం దక్కడం లేదు. ఎప్పుడు తిరిగి వారికి దర్శనమిస్తాడనేది తెలియదు. వేతనాలు, పింఛన్లు, ఇతర ఫిక్స్ డ్ వ్యయాలు చేయాల్సి ఉంటుందని, ఏడాదికి రూ.2,500 కోట్ల వ్యయం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలేశుడి నెలసరి ఆదాయం రూ. 200 నుంచి 220 కోట్లు ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా భక్తులను అనుమతించకపోవడంతో ఆ ఆదాయం రావడం లేదు. 

తిరుమలేశుడిని సాధారణ రోజుల్లో 80 వేల నుంచి లక్ష మంది భక్తులు సందర్శిస్తుంటారు. పండుగల వేళ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే, భక్తులకు మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనం లేకుండా పోయింది. 

click me!