పరీక్షల్లో ఫెయిల్, మనస్తాపం .. ఏపీలో ముగ్గురు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య

By Siva KodatiFirst Published Apr 27, 2023, 6:39 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలైన 24 గంటల్లోనే ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదలైన 24 గంటల్లోనే ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ జిల్లా మల్కాపురం పరిధిలోని త్రినాథపురానికి చెందిన విద్యార్ధిని అఖిల పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇక చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోనూ ఇంటర్ విద్యార్ధి బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని అతను పురుగుల మందు తాగాడు. అటు శ్రీకాకుళం జిల్లా దండుగోపాలపురంలో రైలు కిందపడి తరుణ్ అనే విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి వుంది. అయితే అనుకోని కారణాల వల్ల గంట ఆలస్యంగా ఫలితాలను విడుదల చేశారు. ఎప్పటిలాగే ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో బాలురకంటే బాలికలే పైచేయి సాధించారు. మొత్తం మీద ఫస్టియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత రాగా, సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

Latest Videos

ALso Read: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. కృష్ణా జిల్లా టాప్, విజయనగరం లాస్ట్

ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.సెకండియర్ విషయానికి వస్తే.. 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో బాలురు 58 శాతం , బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 6 నుంచి జూన్ 9 వరకు ప్రాక్టీకల్స్ జరుగుతాయని.. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

 
 

click me!