
తిరుపతి ఉప ఎన్నికలో రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన మేధావుల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిందని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్ధి రత్నప్రభను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని రఘునందన్ రావు ప్రకటించారు. ఒక్క సీటు గెలిచినా ఏపీ రూపు రేఖలు మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో జగన్ సర్కార్ విఫలమైందని రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోయారని, ఎంతో విలువైన ఎర్రచందనం సంపదను రక్షించుకోవడంలో, స్మగ్లర్స్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
స్మగ్లర్లు రోజురోజుకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని... అధికారులపై సైతం దాడులకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు