తెలంగాణ బంద్: ఏపీలో కదలని బస్సులు

By Nagaraju penumalaFirst Published Oct 19, 2019, 3:16 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు రాజకీయ నాయకులను, ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులను నిలిపివేసింది ఏపీఎస్ఆర్టీసీ.  
 

విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ సైతం మద్దతు ప్రకటించింది. తెలంగాణ బంద్ కు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఉద్యోగులు. ఇకపోతే తెలంగాణ బంద్ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్లే బస్సులను నిలిపివేసింది ఏపీఎస్ఆర్టీసీ.  

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఈనెల 5న సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు పద్దెనిమిది ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈనెల 19 వరకు ఉద్యమకార్యచరణ రూపొందించారు. అందులో భాగంగా ఈనెల 19 అంటే శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ బంద్ కు పద్దెనిమిది ఉద్యోగ సంఘాలతోపాటు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, టీజేఎస్ లతోపాటు వామపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. 

ఆర్టీసీ కార్మికులకు మద్దతు రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు అంతా అరెస్ట్ అయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. 

తెలంగాణ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తమ మద్దతు ప్రకటించాయి. బంద్ రోజున నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు రాజకీయ నాయకులను, ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులను నిలిపివేసింది ఏపీఎస్ఆర్టీసీ.  

హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు ఆపేశామని విజయవాడ డీసీటీఎం మూర్తి తెలిపారు.

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు. బంద్ నేపథ్యంలో ప్రయాణికులు సైతం అంతగా రాలేదని చెప్పుకొచ్చారు. బంద్ అనంతరం ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపారు. 
 

click me!
Last Updated Oct 19, 2019, 3:16 PM IST
click me!