జగన్ తో మా ఎమ్మెల్యేలు టచ్ లో లేరు, అది వైసీపీ మైండ్ గేమ్: టీడీపీ నేత అనురాధ

By Nagaraju penumalaFirst Published Jun 24, 2019, 3:46 PM IST
Highlights

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ ప్రయత్నించడం లేదని చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.  

ఒంగోలు: తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ సీఎం వైయస్ జగన్ చెప్పడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ ప్రయత్నించడం లేదని చెప్పుకొచ్చారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ పార్టీ వీడటం లేదని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒంగోలులో అత్యాచారానికి గురైన బాలికను రిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించిన అనురాధ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

ఇకపోతే ప్రజావేదిక కూల్చివేస్తానన్న సీఎం జగన్ వ్యాఖ్యలుపై అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్‌ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కోర్టులో ఉన్న అంశంపై సీఎం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

కనీస సమాచారం ఇవ్వకుండా ప్రజావేదిక నుంచి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సామాన్లు బయట పడేయడం బాధాకరమన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని ప్రశ్నిస్తే ప్రభుత్వ కట్టడం మీకు చెప్పాల్సిన అవసరం లేదని వైసీపీ చెప్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అక్రమ కట్టడం అంటున్న సీఎం జగన్ ఆ భవనంలోనే ఎందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారో చెప్పాలని నిలదీశారు. ప్రజావేదిక పరిసర ప్రాంతాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి యాగం చేస్తే ఇద్దరు సీఎంలు వెళ్లి గంటలు గంటలు కూర్చున్నారని విమర్శించారు. స్వరూపానందేంద్ర సరస్వతికి ఎందుకు అనుమతి ఇచ్చారు..? సమన్యాయం పాటించరా? అంటూ నిలదీశారు. 

మరోవైపు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించిన అనురాధ ఆమెను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులు ఆరుగురిని అరెస్ట్ చేశారని మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 

ఆ నలుగురిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముస్లిం మైనారిటీ, మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమన్నారు. 

రాష్ట్రప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి సుచరిత ఎన్నో పర్యటనలు చేశారని కానీ అత్యాచారానికి గురై నిస్సహాయ స్థితిలో ఉన్న మైనర్ బాలికను పరామర్శించలేకపోయారంటూ విమర్శించారు. 

బాలికను ఇప్పటికైనా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. 

Last Updated Jun 24, 2019, 3:46 PM IST