
వచ్చే ఎన్నికల కోసం శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తీవ్రంగా శ్రమిస్తుంటే కొందరు నాయకులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి (thikka reddy) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని.. పార్టీ అధినేత చంద్రబాబు నేతలను నడిరోడ్డుపై వదిలేశారని తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను సంపాదించినదంతా రాజకీయాల కోసమే ఖర్చు చేశానని.. 2024 ఎన్నికల్లో వున్న కొద్దిపాటి ఆస్తి మొత్తం కరిగిపోతుందని తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను టీకొట్టు పెట్టుకుని బతకాల్సిందేనని తిక్కారెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఆస్తులు అమ్ముకున్నాని.. వచ్చే ఎన్నికల్లో వారంతా దివాలా తీస్తారని, ఇక చేసేది లేక వారంతా ఆత్మహత్యలు చేసుకోక తప్పదని తిక్కారెడ్డి జోస్యం చెప్పారు.
ALso REad:సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ శ్రేణులపై వేధింపులు : డీజీపీకి చంద్రబాబు లేఖ
మరోవైపు.. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి నెగ్గిన తన ప్రత్యర్ధి, వైసీపీ సీనియర్ నేత బాలనాగిరెడ్డిపైనా (y balanagi reddy) ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దేవుడి గదిలో దేవుడి ఫోటోలకు బదులు జగన్ ( ys jagan) ఫోటోలను పెట్టారంటూ విమర్శలు చేశారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా బాల నాగిరెడ్డి బస్తాలకొద్దీ డబ్బు సంపాదిస్తున్నారని తిక్కారెడ్డి ఆరోపించారు. అలాగే వైసీపీ అధిష్టానం .. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం భారీగా డబ్బులు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరి తిక్కారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇకపోతే.. నెల్లూరు జిల్లా (nellore district) కందుకూరులో ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించి.. వాటిని చెత్తబండీలో వేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మున్సిపల్ అధికారులపై భగ్గుమన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు వైసీపీ కార్యకర్తలుగా వ్వవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలనూ తొలగించాలని వారు డిమాండ్ చేశారు.