
ఏపీ రాజధాని అమరావతిలో అక్కడి స్థానికులకు కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పేదలకు కూడా నివాస స్థలాలు కేటాయించేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూములను దిగమింగేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలను ఇవ్వడాన్ని ఇప్పటికే కోర్టు తప్పుపట్టిందని.. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని సాంబశివరావు ఎద్దేవా చేశారు.
సీఆర్డీయే, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్టాలకు జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా సవరణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా.. ఆ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని సాంబశివరావు ఆరోపించారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు , చేర్పులకు అవకాశం ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కోర్టు పరిధిలో వున్న అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలను ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 500 ఎకరాలను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కోర్టు కొట్టేసిందని సాంబశివరావు గుర్తుచేశారు.
Also Read:అమరావతిలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు.. మాస్టర్ ప్లాన్ సవరణకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర
కాగా... అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఉద్దేశించిన దస్త్రానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఆమోదముద్ర వేశారు. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాలకు జగన్ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించడంతో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు మార్గం సుగమమైంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణను చేశారు. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.