చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు

By telugu teamFirst Published May 31, 2020, 8:17 AM IST
Highlights

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు షాక్ ఇవ్వనున్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా మారాలని సాంబశివరావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగలనుంది. టీడీపీ ఎమ్మెల్యే సాంబశివ రావు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆదివారం మార్టూరులో తన అనుచరులతో సమావేశం కానున్నారు. 

మార్టూరులో జరిగే సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తాను టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయంపై మార్టూరులో జరిగే సమావేశంలో సాంబశివ రావు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

సాంబశివ రావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. సాంబశివ రావును పార్టీలోకి తేవడానికి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస రావుతో జరిగిన చర్చల నేపథ్యంలో సాంబశివ రావు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, కరణం బలరాం, వల్లభనేని వంశీ, గిరి ఇప్పటికే టీడీపీ నుంచి వైదొలిగారు. అయితే వారు అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. అనర్హత వేటును తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నట్లు అర్థమవుతోంది. సాంబశివ రావు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. 

తమ పార్టీలోకి రావాలని అనుకునేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ గతంలో చెప్పారు. పార్టీ మారితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి రావాలని అనుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో మధ్యేమార్గాన్ని జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అధికారికంగా చేర్చుకోకుండా తనకు మద్దతు ఇచ్చే రీతిలో వ్యవహారం నడుపుతున్నారు. 

click me!