
ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఓ టిడిపి నేతను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేటకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కపలవాయి విజయ్ కుమార్ కు ఈ కిడ్నీ రాకెట్ సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నరసరావు పేట తహశీల్దార్ ఫిర్యాదు మేరకు విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని భావించిన ఇతడు ముఢావత్ వెంకటేశ్వర్లు నాయక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ మార్పిడి కోసం అనుమతులు తీసుకునే క్రమంలో నకిలీ దృవీకరణ పత్రాలను సమర్పించి వెంకటేశ్వర్లు పోలీసులకు చిక్కాడు.. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ వ్యవహారంలో విజయ్ కుమార్ హస్తం ఉన్నట్లు తహసీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి 2017 లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ మార్పిడి అనుమతులకు కపలవాయి విజయకుమార్ సిఫారసు చేశాడని తహసీల్దార్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో విజయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా కిడ్నీ మార్పిడి కోసం తనను బలవంతంగా ఒప్పించారని వెంకటేశ్వర్లు తెలపడంతో ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు.
ఈ వ్యవహారంతో సంబంధమున్న 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా విజయ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. అతన్ని న్యాయమూర్తి ముందు హాజరు పర్చి రిమాండ్ కు తరలించారు.