ఆ మంత్రి అండతోనే... బందరులో దళిత మహిళ దారుణ హత్య: జవహర్ సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Sep 09, 2020, 11:31 AM ISTUpdated : Sep 09, 2020, 12:13 PM IST
ఆ మంత్రి అండతోనే... బందరులో దళిత మహిళ దారుణ హత్య: జవహర్ సంచలనం

సారాంశం

స్వయంగా తన అనుచరుడే దళిత మహిళను హత్య చేసి ఆధారాలతో పట్టుబడితే మంత్రి పేర్ని నాని ఎందుకు స్పదించటం లేదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. 

మంత్రి పేర్ని నాని అనుచరుడు హరికృష్ణ అలియాస్ నల్లహరి అనే వ్యక్తి బందరులో పద్మజ అనే దళిత మహిళను దారుణంగా  హత్య చేశాడని మాజీ మంత్రి కె.ఎస్  జవహర్ ఆరోపించారు. పద్మజ ఆస్తి కాజేయాలన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసి ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టాలంటూ చిత్ర హింసలు పెట్టి చంపారన్నారు. తన వెనుక మంత్రి ఉన్నాడనే ధైర్యంతోనే అతడు దళిత మహిళను హతమార్చాడని అన్నారు. 

''తన అనుచరుడు హత్య చేసి ఆధారాలతో పట్టుబడితే మంత్రి పేర్ని నాని ఎందుకు స్పదించటం లేదు. మంత్రులు ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి కానీ  రౌడీ షీటర్లు, నేరస్తులతో ఏం పని ? తక్షణమే మంత్రి పేర్నినాని రాజీనామా చేయాలి లేదా  ముఖ్యమంత్రి ఆయనను కేబినెట్ నుండి భర్తరఫ్ చెయ్యాలి'' అని జవహర్ డిమాండ్ చేశారు. 

''ప్రభుత్వం నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి. మంత్రి అనుచరులే దళితులపై హత్యలు, దాడులు చేస్తుంటే ఇక వారికి వైసీపీ పాలనలో  రక్షణ ఎక్కడుంది? రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. వైసీపీ పాలనలో దళితులు రెండవ తరగతి పౌరుల్లా బ్రతుకుతున్నారు'' అని పేర్కొన్నారు. 

read more  అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: ఎంపీ కనకమేడల

''ఈ 16 నెలల కాలంలో దళితులపై దాడులు జరగని రోజు లేదు. దళితుల ఇళ్లు తగలబెట్టడం, సజీవ దహనానికి యత్నం, శిరోముండనాలు, దళిత బిడ్డలపై గ్యాంగ్ రేప్‌లు ఇలా రాష్ట్రంలో ప్రతి రోజూ ఎక్కడో చోట దళితులపై దమనకాండ కొనసాగుతోంది. దళితులు నాకు మేనమామల లాంటి వారని గతంలో జగన్ అన్నారు. మరి మేనమామలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే జగన్ తన  అవసరం కోసం అల్లుకున్న అల్లుడి పాత్ర తప్ప అందులో చిత్తశుద్ధి లేదన్నది ప్రజలకు అర్ధమైంది'' అని అన్నారు. 

''దళితులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి  మౌనంగా ఉండటం వల్లే దళితులపై దాడులు పెరిగి పోతున్నాయి. వైసీపీ పాలనలో న్యాయం ఖరీదైన వస్తువుగా మారిపోయింది.  దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు  తీసుకోక పోగా భాదితులపై తిరిగి అక్రమ కేసులు పెడుతున్నారు. దళితులపై దాడులు అరికట్టేందుకు  తెచ్చిన ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని వైసిపి ప్రభుత్వం నీరుగారుస్తోంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''విజయ్ మాల్యాని నమ్మి  బ్యాంకులు మోసపోయినట్టు జగన్ ని నమ్మి దళితులు మోసపోయారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లతో దళితుల ఓట్లు దండుకున్న వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని విధాలా వారిని అనిచివేస్తోంది'' అని జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు