పట్టాభికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

By Siva KodatiFirst Published Oct 23, 2021, 3:59 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి చేసిన విమర్శల సీబీలను కోర్టుకు సమర్పించారు న్యాయవాదులు. రూల్ ఆఫ్ లా పాటించాలని కోర్ట్  ఆదేశించింది. పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేశారని కోర్ట్ అభిప్రాయపడింది. పోలీసులు దూకుడు తగ్గించుకోవాలని సూచించింది. థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని హైకోర్ట్ వివరణ కోరింది. 

అంతకుముందు బుధవారం నాడు పోలీసులు విజయవాడలో పట్టాభిని అరెస్ట్ చేశారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయస్థానానికి సమర్పించిన పట్టాభి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఇదిలా ఉంటే పట్టాభిని కస్టడీలోకి తీసుకోవాలని విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు టీడీపీ పట్టాభి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ALso Read:రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు బృందం.. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు

శుక్రవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని మచిలీపట్టణం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. టీడీపీ నేతల ఇళ్లపై వైసీసీ నేతల దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 36 గంటల పాటు దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి పోటీగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. నిన్న రాత్రి 8 గంటలతో చంద్రబాబు దీక్ష ముగిసింది. 

కాగా, ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పది మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 21 మందిని అదుపులో తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని బాధితులను కోరారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభి బెయిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. 

click me!