కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అమ్మేద్దామని జగన్ చూస్తున్నారు.. టీడీపీ నేత కన్నా సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమ్మేయాలని జగన్‌ చూస్తున్నారని ఆరోపించారు. 

Google News Follow Us

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమ్మేయాలని జగన్‌ చూస్తున్నారని ఆరోపించారు. నేడు ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఆయన విగ్రహం వద్ద కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోసాలను ప్రజలు గమనించారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అందుకే ఈసారి ఓటర్ల జాబితాలో మార్పులు చేసి  గెలవాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వారి ఓటును కాపాడుకోవాలని.. తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. వైఎస్  జగన్ ఇప్పటికే హైదరాబాద్‌లోని ఏపీ ఆస్తులను పోగొట్టారని.. ఈసారి ఏపీని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారని  ఆరోపించారు. 

ఇక, ఎక్స్ వేదికగా ఎన్జీ రంగాకు కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. ‘‘ఆధునిక భారతదేశ శాస్త్ర విజ్ఞాన రంగానికి మార్గదర్శకులు ఆచార్య ఎన్ జీ రంగా జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.. ఎన్ జీ రంగా గారి ఆవిష్కరణలు, పరిశోధనలు భారతదేశాన్ని ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంలో ముందున్న దేశాలలో ఒకటిగా నిలబెట్టాయి. భారతీయ శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలిచిన రంగా  జ్ఞాపకాలు శాస్త్ర పరిశోధన రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటాయి’’ అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.