జర్మనీలో హిట్లర్, ఏపీలో జగన్... సేమ్ టు సేమ్: దేవినేని ఉమ ఫైర్

By Arun Kumar PFirst Published Jan 12, 2021, 4:43 PM IST
Highlights

జగన్ రెడ్డి 19 నెలల పాలనలో రాష్ట్రంలో 150 దేవాలయాలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 

విజయవాడ: జర్మనీలో రిచ్ స్టాగ్ (పార్లమెంట్ భవనం)ను హిట్లర్ తగులబెట్టించి ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై మోపి అమానుషాలు చేసినట్లుగానే సీఎం జగన్ వ్యవహారశైలి వుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలోని దేవాలయాల దాడులపై తాజాగా జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందకు నిదర్శనమన్నారు.

''జగన్ రెడ్డి 19 నెలల పాలనలో రాష్ట్రంలో 150 దేవాలయాలపై దాడులు జరిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇప్పటివరకు ఏ ఘటనలోనూ చర్యలు తీసుకోలేదు. 70 ఏళ్ల ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఇన్ని దాడులు ఎప్పుడైనా జరిగాయా? ప్రభుత్వ అండ వల్లే ఏడాది నుంచి దోషులను గుర్తించలేదు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మత, కుల, ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొడుతోంది'' అని ఆరోపించారు.

''అమరావతి పేరుతో కుల, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కౌలు రైతులు, ఆంగ్ల మాద్యమం పేరుతో కులచిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషనర్ కు కూడా ముఖ్యమంత్రే కులాన్ని ఆపాదించే స్థితికి వచ్చారు. ఇవన్నీ కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని వైకాపానే ప్రేరేపిస్తున్నది. ఈ కుట్రలను కప్పిపెట్టుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నది'' అన్నారు.

''గుడులపై దాడులు చేస్తున్న దోషులను పట్టుకోవడంపై శ్రద్ధ లేదు. జగన్ రెడ్డి తీరు హిట్లర్ ను తలపిస్తోంది. జర్మనీలో రిచ్ స్టాగ్ (పార్లమెంట్ భవనం) ను తగులబెట్టించిన హిట్లర్.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైన,యూదులపైన నెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు. జర్మనీలో హిట్లర్ మాదిరిగా జగ్మోహన్ రెడ్డి దిగజారారు. ఇద్దరూ విధ్వంసాలకు పాల్పడి ఇతరులపై నిందలు వేస్తున్నారు, దాడి చేస్తున్నారు. జగన్ రెడ్డి దాడుల ఉన్మాదాన్ని విడనాడకపోతే చారిత్రక తప్పిదం చేసినవారవుతారు'' అని ఉమ హెచ్చరించారు. 

click me!