
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, చింతమనేని ప్రభాకర్‌కు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలోనే చింతమనేని చొక్కా చినిగిపోయింది. అనంతరం చిరిగిన చొక్కాతోనే చింతమనేని ప్రభాకర్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చింతమనేని మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో చింతమనేని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనపై ప్రభుత్వం 31 కేసులు పెట్టిందని.. అయితే కేసులకు భయపడేది లేదని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతి పడుతుందని తనను ఉదాహరణగా చూపాలనుకుంటున్నారని అన్నారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమి చేయలేరని అన్నారు. ఈ ఘటనపై డీజీపీ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనతో డీఎస్పీ సత్యనారాయణ ఒక్కరే దురుసుగా ప్రవర్తించారని.. మిగిలిన పోలీసులు ఎవరూ కూడా ఓవర్ యాక్షన్ చేయలేదని అన్నారు.
మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన అనంతరం చింతమనేని ప్రభాకర్ నేరుగా డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీ సమయం ఇస్తే ఆయనను కలిసి.. డీఎస్పీ సత్యనారాయణపై ఫిర్యాదు చేయనున్నట్టుగా చింతమనేని చెబుతున్నారు.