వైఎస్ వివేకా కేసు.. అవినాష్‌పై టీడీపీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 18, 2022, 2:30 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి (b tech ravi) సవాల్ విసిరారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి (b tech ravi) సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని ఏ దేవుడి మీద అయినా ప్రమాణం చేయగలరా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు.

వివేకా కుటుంబ సభ్యులు జగన్ వద్దకు వెళ్లి వివేకా హత్య కేసు విషయమై ఒత్తిడి తెచ్చారని... అయితే, అవినాశ్ సపోర్ట్ చేయకపోతే ఆయన వైసీపీని వీడి బీజేపీలోకి వెళతాడని వారికి జగన్ చెప్పారని బీటెక్ రవి ఆరోపించారు. ఈ విషయం గురించి వివేకా కుటుంబ సభ్యులను అడిగితే చెపుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలోకి రావాలంటూ ఇప్పటికీ ఆ పార్టీ నేతలు తమను అడుగుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు. వైసీపీ నేతలకు, కడప జిల్లా ప్రజలకు శివశంకర్ రెడ్డి చరిత్ర తెలుసునంటూ దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో తాము ఎక్కడైనా, ఎలాంటి ప్రమాణానికైనా సిద్ధమేనని, వైసీపీ నేతలు సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు.

కాగా.. 2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు. అయితే ఈ హత్య కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలపై సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అయితే ఈ కేసులో సీబీఐకి వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అప్రూవర్ గా మారాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన విషయాలను వివరించారు.

ఈ మేరకు  దస్తగిరి  ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. ఈ కేసులో ఇంకా కొందరి పాత్ర గురించి సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. శివశంకర్ రెడ్డికి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోర్టులో సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కోర్టు శివశంకర్ రెడ్డి అభిప్రాయం కూడా కోరనుంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగుళూరులో భూమి సెటిల్ మెంట్ కారణమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి తెలిపారు. అయితే సీబీఐ ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. ఈ తరుణంలో  కొందరు ఎస్పీలకు ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

click me!