ఆ భూములు అమ్మినా...మేం అధికారంలోకి రాగానే లాక్కుంటాం: బోండా హెచ్చరిక

By Arun Kumar PFirst Published May 14, 2020, 12:47 PM IST
Highlights

ప్రభుత్వ భూముల అమ్మకాల పేరిట వైసిపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టిడిపి మాజీ ఎమ్మెల్యే  బోండా ఉమ ఆరోపించారు. 

విజయవాడ: ప్రభుత్వ భూములను అమ్ముకోడానికి బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో వైసిపి ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని టిడిపి నాయకులు బోండా ఉమ ఆరోపించారు. 
తమ వాళ్లకు భూములను దోసిపెట్టడానికే తాజా జీవోను ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూములను అమ్మకాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని... ఈ అమ్మకాలను 
అడ్డుకుంటామని బోండా ప్రకటించారు. 

ఇప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన భూములను ఎవరైనా కొన్నా తాము అధికారంలోకి రాగానే స్వాదీనం చేసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు ఇలా భూములను అమ్ముకుంటూ పోతే ఇప్పుడు భూములు మిగిలేవా అన్నారు. లోటు బడ్జెట్ లో కూడా సమర్థవంతంగా చంద్రబాబు పరిపాలన చేపట్టారని... కానీ జగన్ కు పరిపాలన చేతగాక భూములు అమ్మకం పేరుతో కొట్టేయాలని చూస్తూన్నారని  బోండా ఉమ మండిపడ్డారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుండేందుకు వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల అమ్మకాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. 

విశాఖపట్నంలో ఆరు, గుంటూరులో మూడు చోట్ల ఇ-ఆక్షన్ ద్వారా భూముల అమ్మకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న ఇ-ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు  వెల్లడించారు. నగదు చెల్లింపు తరువాతే భూములపై పూర్తి హక్కులు కొనుగోలుదారులకు రానున్నాయి. ఎలాంటి ఆక్రమణలు, తగాదాలు లేకుండా భూములు వేలం వేస్తున్నట్లు బిల్డ్ ఏపీ ప్రకటించింది. 
  

click me!