భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలి: కడప ఎస్పీతో ఏవీ సుబ్బారెడ్డి భేటీ

By narsimha lodeFirst Published Jul 16, 2020, 4:12 PM IST
Highlights

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు మంత్రి అఖిలప్రియ కుటుంబం సుఫారీ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

కడప:మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు మంత్రి అఖిలప్రియ కుటుంబం సుఫారీ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

 టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి  కూతురు జస్వంతితో కలిసి గురువారం నాడు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన ఎస్పీని కోరారు.  ఏ 4 అయిన భూమా అఖిలప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఏ1 నుండి ఏ6 వరకు అందరిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

పోలీసులు మూడు నోటీసులు ఇచ్చినా కూడ భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికే వాళ్లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు  వేశారన్నారు. ముందస్తు బెయిల్ దొరికితే పోలీసులకు వాళ్లు పలికే పరిస్థితే ఉండదన్నారు. అదే  జరిగితే తనపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తనను చంపాలని సుఫారీ ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మహిళా ముసుగులో భూమా అఖిలప్రియ హత్యా రాజకీయాలు చేస్తోందని ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి ఆరోపించారు. అఖిలప్రియతో పాటు ఆమె  భర్త భార్గవ రామ్ ను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
 

click me!