ప్రవీణ్‌ బయటి వ్యక్తి.. పార్టీ సభ్యత్వం కూడా లేదు: టీడీపీ క్రిస్టియన్ సెల్

By Siva KodatiFirst Published Jan 12, 2021, 7:11 PM IST
Highlights

తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రవీణ్ అనే వ్యక్తి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దారాల మ్యానీ ఓ ప్రకటన విడుదల చేశారు

తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రవీణ్ అనే వ్యక్తి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మద్దారాల మ్యానీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా ప్రవీణ్‌కు పార్టీ సభ్యత్వం కూడా లేదని.. దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని పార్టీ అభిమానులు, క్రిస్టియన్ సోదరులు గ్రహించాలని మద్దిరాల తెలిపారు.

ప్రవీణ్ అనే వ్యక్తి మరోసారి తెలుగుదేశం పార్టీ పేరు వినియోగించినా, ప్రచారంలో పార్టీ ఫొటోలు వాడినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్రైస్తవుల మద్ధతు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే ఉంటుందని మద్దిరాల మ్యానీ స్పష్టం చేశారు. 

అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీడీపీ క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు అంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. టీడీపీలో ఎంతోకాలంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నామని వారు వెల్లడించారు.

చంద్రబాబు 5వ తేదీన చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

ఆయన ఎప్పుడూ ఇలాంటి మాటలు గతంలో‌ చేయలేదని.. ఆ మాటలతో క్రైస్తవులు మనోభావాలు దెబ్బ తిన్నాయని ప్రవీణ్ స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు అనేక సార్లు చర్చిలో మీరు‌ ప్రార్ధనలు కూడా చేశారని.. మసీదులకు‌ వెళ్లి నమాజ్‌ చేసి శుభాకాంక్షలు చెప్పలేదా అని ఆయన నిలదీశారు.

లౌకిక దేశంలో అన్ని మతాల వారు, అన్ని పండుగలలో పాల్గొంటారని ప్రవీణ్ గుర్తుచేశారు. చర్చి ఫాదర్ లకు ఐదు‌వేల రూపాయలు ఇస్తే... తప్పు పట్టడం దేనికన్న ఆయన మీ మ్యానిఫెస్టోలో  కూడా అనేక పధకాలు పెట్టలేదా అని ప్రశ్నించారు.

మత మార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్ లను అవమానించారని.. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపించాలని ప్రవీణ్ సవాల్ విసిరారు. గ్రామాలలో చర్చిలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదని హితవు పలికారు.

గతంలో క్రైస్తవుల కు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రవీణ్ ప్రశ్నించారు. తాము మీ అభివృద్ధి కోసం పని‌చేస్తే... తమను ఇలా బాధ పెట్టడం సరి కాదన్నారు.

పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా .. స్పందించ లేదని, అందుకే మీడియా సమావేశం ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నామని ప్రవీణ్ చెప్పారు. క్రైస్తవులు పై ఇలాంటి  వ్యాఖ్యలు ఎందుకు‌ చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

click me!