సీఎం జగన్ వల్లే సచివాలయ ఉద్యోగుల మృతి...: చంద్రబాబు ఆగ్రహం

By Arun Kumar PFirst Published Apr 19, 2021, 3:34 PM IST
Highlights

కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన పడి మృతి చెందారని...  మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి చీఫ్  చంద్రబాబు కోరారు. 

అమరావతి: కరోనా బారినపడి ఏపీ సచివాలయ ఉద్యోగులు మృతిచెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడి మృతి చెందారని...  మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. 

''ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణం. ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదు.  ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సిందేనని చెప్పడమేంటి? సీఎం జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది'' అని చంద్రబాబు ఆరోపించారు. 

read more  ఏపీ సచివాలయంలో కరోనా కలకలం... మరో మహిళా ఉద్యోగి మృతి

''ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలి. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి'' అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సూచించారు

ఇక సెక్రటేరియట్ ఉద్యోగుల మృతిపై టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటిరోజు అత్యంత దురదృష్టకరమైందని అన్నారు. సచివాలయంలో ముగ్గురు కరోనాతో మరణించడం అత్యంత బాధాకరమని... ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. వ్యాక్సిన్  పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 

''ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు ప్రజలకు చేర్చడంలో కీలకమైన అన్నిశాఖల ఉద్యోగులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.  ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించే పీపీఈ కిట్లను ప్రభుత్వ ఉద్యోగులకుకూడా అందించాలి. మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకు వర్తించే ప్రయోజనాలను ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తింపచేయాలి. ప్రభుత్వ అలసత్వం వివిధశాఖల ఉద్యోగులకు ప్రాణాంతకంగా మారకూడదు'' అని అశోక్ బాబు సూచించారు.  

click me!