టీడీపీ సీట్లు జనసేనకి .. త్యాగం చేయమంటే తమ్ముళ్లు ఊరుకుంటారా, అసంతృప్తులను బాబు ఎలా మేనేజ్ చేస్తారో..?

By Siva KodatiFirst Published Dec 29, 2023, 5:15 PM IST
Highlights

జనసేనతో పొత్తు కారణంగా తెలుగుదేశం నేతలు కొందరు టికెట్లు కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇష్టమున్నా లేకున్నా త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. మరి టికెట్లు కోల్పోయే తెలుగు తమ్ముళ్లు కామ్‌గా వూరుకుంటారా. 

మరికొద్దినెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణపై ప్రస్తుతం ఇద్దరు అధినేతలు కసరత్తు చేస్తున్నారు. గెలిస్తే సీఎం అయ్యేది ఎవరనే సంగతి పక్కనబెట్టి ముందు వైసీపీని ఓడించే దిశగా శ్రమించాలని భావిస్తున్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందోనన్న అనుమానంతో చివరికి ప్రశాంత్ కిషోర్‌తోనూ చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారంటే ఆయన ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

అంతా బాగానే వుంది కానీ.. జనసేనతో పొత్తు కారణంగా తెలుగుదేశం నేతలు కొందరు టికెట్లు కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇష్టమున్నా లేకున్నా త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎలా అనుకున్నా 30 నుంచి 40 సీట్లను జనసేనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి టికెట్లు కోల్పోయే తెలుగు తమ్ముళ్లు కామ్‌గా వూరుకుంటారా. ఈ ఐదేళ్లలో అధికార వైసీపీ బెదిరింపులు, కేసులు, తలనొప్పులను ధైర్యంగా ఎదుర్కొని పార్టీ జెండా మోసింది మరెవరికో టికెట్ ఇస్తుంటే మౌనంగా చూడటానికా అని కొందరు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు టీడీపీ నేతల్లో ఈ గుబులు వెంటాడుతోంది. పార్టీ కోసం ఆస్తుల్ని అమ్ముకుని మరి శ్రమించిన తమను పక్కనపెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది చివరికి అసంతృప్తిగా మారి సహాయ నిరాకరణకు దారి తీసే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లు పిలిచి హామీ ఇచ్చినా వినేవాళ్లు అతి తక్కువ మంది మాత్రమే వుంటారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ, రాజ్యసభకు పంపడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామనే మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో చూడాలి. కాస్తలో కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే .. రాయలసీమ. టీడీపీతో పొత్తులో వున్న జనసేన కానీ త్వరలో వస్తారని భావిస్తున్న బీజేపీ, కమ్యూనిస్టులకు సీమలో బలం తక్కువ. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే పెద్ద సంఖ్యలో టికెట్లు కోరే అవకాశం వుంది. 

జనసేన - టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత తెలుగుదేశంలో అసంతృప్తుల సెగలు రగిలే అవకాశం వుంది. అప్పటి వరకు నేతలు సైలెంట్‌గా జరిగేది చూస్తారు. ఆ తర్వాతే అసలు సినిమా చూపించనున్నారు. మరి తెలుగు తమ్ముళ్ల బ్లాక్‌మెయిలింగ్‌ను, హంగామాను చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి. కాకపోతే .. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎంతోమంది నేతలను, ఎన్నో ఎన్నికలను చంద్రబాబు చూశారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడనక్కర్లేదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.?
 

click me!