అందుకే వాళ్లు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Published : Jul 24, 2022, 03:01 PM IST
అందుకే వాళ్లు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సారాంశం

భద్రాచలాన్ని అనుకుని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు.. తమ గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

భద్రాచలాన్ని అనుకుని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు.. తమ గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కనీస సాయం అందడం లేదని.. అందుకే ప్రభుత్వంపై విలీన గ్రామాల ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. నమ్మకం కోల్పోవడంతోనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

‘‘రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారు. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు అత్యంత దారుణం. కరెంట్ రాకపోవడంతో తాగడానికి, ఇళ్లు శుభ్రపరుచుకోవడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారు. వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్ల పై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు. వారం క్రితమే వరదలు తగ్గాయి అని ప్రకటనలు చేసిన మంత్రులు...మరి ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్దరించ లేకపోయారో చెప్పాలి.

జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారన్నమాట.  ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండి. ప్రభుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు, గాలి మాటలు పక్కన పెట్టి యుద్దప్రాతిపధికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి’’ అని చంద్రబాబు  డిమాండ్ చేశారు. 

వివాదం ఏమిటంటే..
ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇటీవల గోదావరి వరదలతో వీరి డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఈ 5 గ్రామపంచాయితీలు.. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు కూడా చేశాయి.అఖిలపక్షంగా ఏర్పడి పోరాటం సాగించేందుకు రెడీ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఆదివారం కన్నాయిగూడెం రహదారిపై గ్రామస్థులు ధర్నా, వంటావార్పు నిర్వహించారు. ఎటపాక పరిధిలోని 5 గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. తమకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తమను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని వారు కోరుతున్నారు.  ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu