మారణాయుధాలతో ఇంటిపై దాడి: జగన్ కు చంద్రబాబు బహిరంగ లేఖ

By Arun Kumar P  |  First Published Dec 29, 2020, 11:02 AM IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని...జేసి ఇంటిపైకి మారణాయుధాలతో వెళ్లిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. 
 


అమరావతి: తాడిపత్రిలో ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి వర్గాల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.  జెసి ఇంటికి వెళ్లిమరీ పెద్దారెడ్డి దౌర్జన్యం చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని...జేసి ఇంటిపైకి మారణాయుధాలతో వెళ్లిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. 

జగన్ కు చంద్రబాబు రాసిన లేఖ యధావిధిగా:
 
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి,

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,

అమరావతి.

నమస్కారములు.


విషయం: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం-శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటడం- తాడిపత్రిలో  టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి దౌర్జన్యం-సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు-మారణాయుధాలతో ఇంటిపైకి దాడి చేసినవాళ్లు స్వేచ్ఛగా తిరగడం- బాధితులపై ఎదురు కేసులు బనాయించడం దారుణం- తక్షణమే నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం, జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి భద్రత కల్పించడం గురించి.
 

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా భగ్నం, క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్ష్యం తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి (డిసెంబర్ 24న) వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి గ్యాంగ్ మారణాయుధాలతో వెళ్లి దౌర్జన్య కాండ.. కరడుగట్టిన ఫాక్షనిస్టులు కూడా ఇటువంటి దుర్మార్గానికి తెగించిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదు. 

జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో పట్టపగలు ఆయన ఇంటిపైకి పెద్దారెడ్డి తన అనుచరుల గుంపు వెంటేసుకుని మారణాయుధాలతో వెళ్లడం, అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడం, సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను న్యూస్ టీవి ఛానళ్లు, ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్రం మొత్తం చూసింది. గత 19నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు, ఎటునుంచి, ఏ మాఫియా మూక దాడిచేస్తుందో అనే భయాందోళనల్లో ప్రజానీకం ఉంది. ప్రాణాలు అరచేత పెట్టుకుని అన్నివర్గాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రాష్ట్రంలో ఏ స్థాయిలో శాంతిభద్రతలు క్షీణించాయో, పోలీసుల్లో కొందరు ఏవిధంగా అధికార పార్టీ వైసిపితో కుమ్మక్కు అయ్యారో తాడిపత్రి దుర్ఘటనే నిదర్శనం. 

ఇంటి నిర్మాణానికి ఇసుక కోసం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ కావడం, దానిపై అక్కసు పట్టలేక వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చూస్తుంటే అధికార పార్టీ వైసిపి నాయకుల దాష్టీకాలు ఏస్థాయికి పేట్రేగాయో విదితం అవుతోంది. ఎమ్మెల్యే భార్యకు మామూళ్లు ఇవ్వలేక ఇసుక సరఫరా ఆపేశానని కాంట్రాక్టర్ చెప్పడానికి, టిడిపి నాయకుడికి ఏమైనా సంబంధం ఉందా..? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం గురించి విన్నాం. కానీ ఇసుక దొంగలు ఎవరంటే ఇళ్లపై దాడికి పాల్పడటం ఇప్పుడే చూస్తున్నాం. ఇసుక అడిగిందెవరు, ఇసుక సరఫరాపై సమాధానం చెప్పిందెవరు, మధ్యలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గ్యాంగ్ ను వెంటేసుకుని వెళ్లడం ఏమిటి..? తాడిపత్రిలో భయోత్పాతం సృష్టించడం ఏమిటి..?  ఎవరి ఇంటికెవరు వచ్చారు, ఏం చేశారు వివరాలన్నీ సిసి కెమెరాలలో రికార్డు అయివున్నాయి. దాడి చేసిన వాళ్లపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గర్హనీయం. 

సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరియు ఆయన అనుచరులపై కేసులు పెట్టాల్సి వుండగా, బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించడం హేయం.   జెసి ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు, మరో 12మందిపై ఐపిసి 147, 148,506, 307, 427 రెడ్ విత్ 149ఐపిసి, 3(1)(ఆర్), 3(1)(ఎస్),3(2)(వి) సెక్షన్లతో ఎదురు కేసులు పెట్టడం దారుణం(తాడిపత్రి పిఎస్ లో ఎఫ్ ఐఆర్ నెం 848/2020, 849/2020, 850/2020 తేది 25.12.2020). 

ఇంటిపైకి దాడికి వచ్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తదితరులంతా స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరుగుతుంటే, బాధితులు తప్పుడు కేసులలో చిక్కుకోవడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాలకుల అండ చూసుకునే రాష్ట్రవ్యాప్తంగా నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. రౌడీయిజం, గుండాగిరీ, దాడులు-దౌర్జన్యాలకు యధేచ్ఛగా పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని వైసిపి నాయకుల గుండాగిరీకి, దుర్మార్గాలకు, దౌర్జన్యకాండకు తక్షణమే అడ్డుకట్ట వేయాలి. రూల్ ఆఫ్ లా నిలబెట్టాలి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాలి. ప్రజాస్వామికంగా పరిపాలన సాగించాలి. శాంతిభద్రతలను పరిరక్షించాలి.

జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో ఎవరికే ఆపద వాటిల్లినా మీరే బాధ్యత వహించాలి.  పూర్తిస్థాయిలో జెసి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి. ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహా నిందితులు అందరిపై కఠిన చర్యలు చేపట్టాలి. ఇటువంటి దుర్ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను.. 

(నారా చంద్రబాబు నాయుడు) 

click me!