ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. జగన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. జగన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులే తప్ప.. చట్టం, ధర్మం లేవని విమర్శించారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టి ముఖ్యమంత్రి జగన్ ఆనందపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శలు గుప్పించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు పేరుతో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలోనే కాదు చంద్రబాబును, ఆయన విజన్ దేశంలోని పలువురు నాయకులు కొనియాడారని చెప్పారు.
చంద్రబాబు ఉగ్రవాది కాదని, పారిపోయే వ్యక్తి కాదని, ఎక్కడో దాక్కుని తప్పించుకునే కాదని, కేంద్ర ప్రభుత్వ భద్రత కలిగిన వ్యక్తి అని.. అలాంటి ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానం దారుణం అన్నారు. నిన్నటి రోజు చికటీ రోజు అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఐడీ వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. కార్యకర్తలు రోడ్డు మీదకు తీసుకువస్తే వాళ్లపై విచక్షణ రహితంగా దాడులు చేశారని చెప్పారు.
సీఐడీ జగన్ తొత్తుగా మారిందని ఆరోపించారు. వైసీపీ ఏది చెబితే అది చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు కనీసం నిద్రపోయేందుకు అవకాశం కల్పించకుండా చేసి తీవ్ర ఇబ్బందులకు గుర్తుచేశారని అన్నారు. ఆరోజు ఈ ప్రాజెక్టు అమలు చేసిన అధికారుల పేర్లు ఈ కేసులో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబుకు, తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో గానీ, రాజకీయ వ్యవస్థలో గానీ ప్రజలకు తాము న్యాయం చేశామని చెప్పారు. ఎవరి నుంచైనా తనకు, తన కుటుంబానికి గానీ, చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి గానీ ఎక్కడైనా ఒక్క పైసా వచ్చిందని నిరూపిస్తే.. పీక కోసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటాం గానీ తప్పు చేసే అలవాటు లేదన్నారు.
సీమెన్స్ కంపెనీ జీఎస్టీ కట్టలేదని వాళ్లకు నోటీసులు ఇస్తే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి, అవినీతి ముద్ర ఉంది కాబట్టి.. చంద్రబాబు మీద కూడా ఆ బురద వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అడ్డుకోవడం సరికాదని అన్నారు.