శ్రీదేవి కులంపై ఫిర్యాదు: విచారణకు హాజరు కావాలని జేసీ ఆదేశాలు

By narsimha lodeFirst Published Nov 19, 2019, 11:40 AM IST
Highlights

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదంపై అందిన ఫిర్యాదులపై ఈ నెల 26న గుంటూరు జాయింట్ కలెక్టర్ విచారణ నిర్వహించనున్నారు. 


అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్‌‌సీ సామాజిక వర్గానికి చెందింది కాదంటూ దాఖలైన ఫిర్యాదులపై ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలని  గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా  తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదని దాఖలైన ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ స్పందించారు.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధి శ్రావణ్ కుమార్ పై ఆమె విజయం సాధించారు.

అయితే శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కాదని ఆమెపై ప్రత్యర్ధులు పిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారణ చేయాలని  భావించారు. ఈ నెల 26న తన కులాన్ని నిరూపించుకొనేందుకు అన్ని రకాల ఆధారాలను తీసుకొని రావాలని జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీదేవిని కోరారు. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎమ్మెల్యే శ్రీదేవిపై జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కాదని తేలితే ఆమె తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.

click me!