గుంటూరు : చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురి మృతి .. పలువురికి తీవ్ర గాయాలు

By Siva KodatiFirst Published Jan 1, 2023, 6:57 PM IST
Highlights

గుంటూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆదివారం గుంటూరులో జరిగిన సభలో ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ఒకరు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గోపిశెట్టి రమాదేవి, ఆసియాగా గుర్తించారు. పలువురు గాయపడటంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి కానుకలు ఇస్తామంటూ పది రోజుల నుంచి టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీల నుంచి ఒక్కొక్కరికి రూ.24 లక్షల ఆర్ధిక సాయం అందించారు. అలాగే మృతుల పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ కూడా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు
 

click me!