తండ్రి చనిపోయాడన్నా.. రాలేనన్న కొడుకు.. కరోనా నెగటివ్ వచ్చినా... !!

By AN TeluguFirst Published May 8, 2021, 10:47 AM IST
Highlights

కరోనా ఎన్ని ఘోరాలో కళ్ల చూసేలా చేస్తోంది. కన్నవాళ్లను దూరం చేస్తుంది. అందరూ ఉండి అనాథల్లా అంతిమయాత్ర చేయాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. మొత్తంగా మానవత్వం మంట గలుస్తోంది. మానసంబంధాలు మసిబారిపోతున్నాయి. 

కరోనా ఎన్ని ఘోరాలో కళ్ల చూసేలా చేస్తోంది. కన్నవాళ్లను దూరం చేస్తుంది. అందరూ ఉండి అనాథల్లా అంతిమయాత్ర చేయాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. మొత్తంగా మానవత్వం మంట గలుస్తోంది. మానసంబంధాలు మసిబారిపోతున్నాయి. 

తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ తండ్రి కరోనాతో కాకుండా అనారోగ్యంతో చనిపోయాడని తెలిసినా వచ్చి తలకొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడు.

దీంతో అనాధ శవంగా అంత్యక్రియలు పూర్తి చేసిన విషాద సంఘటన ఇది. కృష్ణా జిల్లా, చిన తాడినాడకు చెందిన కలిదిండి రాంబాబు(63)తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.

దివ్యాంగుడైన అల్లుడు నరసింహారావు మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వైద్యం నిమిత్తం శుక్రవారం ఆకివీడు సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. అక్కడ వైద్యుడు రంగారావు పరీక్షించి అప్పటికే ఆయన చనిపోయాడని తెలిపారు.

అనంతరం మృతదేహానికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అల్లుడు దివ్యాంగుడు కావడంతో సిబ్బంది మృతుడి కుమారుడికి ఫోన్ చేసి చనిపోయిన సమాచారం అందించారు. అయితే ఆ కొడుకు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. 

ప్రస్తుతం తాను ఊర్లో లేను మీరే కానిచ్చేయండి.. అంటూ ఆ కొడుకు సమాధానమిచ్చాడు. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించగా కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులను పంపించారు. కైలాస వాహనంలో మృతదేహాన్ని తరలించి వారే అంత్యక్రియలు పూర్తి చేశారు.

click me!