విజయవాడ నుండి మధ్యప్రదేశ్ కు శ్రామిక్ రైలు... ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి

By Arun Kumar PFirst Published May 18, 2020, 8:32 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా  ఆంధ్ర ప్రదేశ్ లో చిక్కుకున్న వలసకూలీలతో విజయవాడ నుండి మధ్యప్రదేశ్ కు మరో శ్రామిక్ రైలు బయలుదేరింది.   

అమరావతి: విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే స్టేషన్ నుండి మధ్యప్రదేశ్ కు ఇవాళ(సోమవారం) మరో శ్రామిక రైలు కార్మికులలో బయలుదేరింది. ఈ  శ్రామిక రైలును దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఈ శ్రామిక రైలు ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా యాభై రోజులుగా పనులు లేక పస్తులు ఉంటున్న కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేయడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 

''లాక్ డౌన్ వలస కూలీలు దేశ  వ్యాప్తంగా ఇబ్బందులు పడ్డారు. సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు‌ చేయాలని ఆదేశించారు. నడిచి వెళుతున్న కార్మికులకు ఆహారం, మంచినీరు సదుపాయం కల్పించాం. అందరూ బస్సు, రైళ్లల్లో‌ వెళ్లేలా చూడాలని సిఎం ఆదేశించారు.నేడు ఎంతో మంది తమ‌ స్వస్థలాలకు ఆనందంగా వెళుతున్నారు. సిఎం‌ చేసిన సాయం చూసి కార్మికులు అభినందనలు తెలుపుతున్నారు'' అని అన్నారు. 

''ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు 12 రైళ్లు, 143 బస్సులు లను జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలకు పంపాం. ఇంత చేస్తున్నా ప్రతితిపక్షాలు రాజకీయం‌ చేస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న పనులకు అభినందనలు తెలపకపోయినా పరవాలేదు కానీ అడ్డంకులు కల్పించవద్దు. చంద్రబాబు నాయుడు జూమ్ వీడియోల ద్వారా ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు.రాయనపాడు వచ్చి చూస్తే వారికి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది'' అని తెలిపారు. 

''పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లు కాదు వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు. వామపక్ష పార్టీలు కూడా టిడిపి తోక పార్టీ లుగా మారిపోయారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు'' ఆరోపించారు. 

''ప్రతి కార్మికుడు కష్టపడకుండా సొంత ప్రాంతాలకు చేరేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎవరూ నడిచి వెళ్లకుండా అధికారులను సంప్రదించి రైళ్లల్లో‌ వెళ్లేలా పేర్లు నమోదు చేసుకోవాలి'' అని మంత్రి వెల్లంపల్లి కార్మికులకు సూచించారు. 

click me!