హోటల్లో కూర్చుని రాజకీయం, చంద్రబాబు కోసమే.: నిమ్మగడ్డపై అప్పలరాజు

By telugu teamFirst Published Jan 9, 2021, 3:20 PM IST
Highlights

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాసలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పిందని, అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. 

అది కోర్టు ధిక్కారం కాదా..? అని  ఆయన నిమ్మగడ్డను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా స్ట్రైయిన్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని, మరోవైపు వ్యాక్సిన్‌ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైందని అన్నారు. 

ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత అని ఆయన అడిగారు. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్ అని ఆయన నిమ్మగడ్డను ఉద్దేశించి అన్నారు. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదని ఆయన అన్నారు.

వ్యక్తిగత ఆసక్తి మీ స్థాయికి మంచిది కాదు : ఎంపీ మాధవ్‌

నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహరిస్తున్న ఏకపక్షతీరుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు. 'ప్రపంచమంతా ఒకవైపు అంటే నేను మాత్రం మరోవైపు అనే విధంగా నిమ్మగడ్డ  వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తున్నారని అన్నారు. వ్యక్తిగత ఆసక్తి అనేది మీ స్థాయికి మంచిది కాదని ఆయన నిమ్మగడ్డుకు సూచించారు. 

ప్రభుత్వ యంత్రాంగం కరోనా టీకాను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోందని, ఇప్పుడు ఎన్నికలు జరిపితే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉన్నందున కరోనా టీకా పంపిణీకి అంతరాయం కలుగుతుందని ఆయన అన్నారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్నతీరుతో ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని అన్నారు.

టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు: అమరనాథ్‌

నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అనుబంధ సభ్యునిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ అన్నారు. ఎన్నికల కమిషనర్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహిస్తూ చంద్రబాబు, సుజనా చౌదరితో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల భయాందోళనలను నిమ్మగడ్డ పట్టించుకోవడంలేదు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ మొదలైందని చెప్పారు. 

స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గుడివాడ అమరనాథ్‌ సూచించారు.

click me!