
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికబద్ధంగా పనిచేశామన్నారు. ఇప్పుడు వైసీపీ పాలనతో విధ్వంసాలతో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తిగా రాష్ట్రంలోపోరాటం చేయాలని ఆయన తెలిపారు. రాజ్యాంగం మంచిది అయినా దాన్ని అమలు పరిచేవాళ్లు మంచివాళ్లు కాకపోతే ఫలితం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు.
ALso REad: బాలకృష్ణ కామెంట్స్ తప్పు.. ఆ తీవ్రత తెలియదు.. అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి: మంత్రి రోజా
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం అంతా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలోని యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే భారత్ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అవకాశాలు కల్పిస్తే తెలుగు ప్రజలు ఎన్నో అద్భుతాలు సాధిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయానికి భారతదేశం అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలాలను ప్రస్తుతం తెలంగాణ పొందుతోందని చంద్రబాబు తెలిపారు.