ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా లేఖ రాశారు. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. వివరాలు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నిందితుడిగా పేర్కొన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు విచారిస్తున్నారు.
అయితే చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ జడ్జి హిమబిందు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత ఆమెను కించపరుస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కొందరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్టుగా అవుతుందని హైకోర్టు న్యాయవాది రామనుజం రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్న జడ్జి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా స్పందించారు. ఈ క్రమంలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జడ్జి హిమబిందుపై వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని పీసీ మీనా ఆదేశించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు వివరించాలని లేఖ రాశారు.
ఇదిలాఉంటే, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు భద్రతను పెంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా అదనపు భద్రత కల్పించారు.