ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్.. కండీషన్స్ పెట్టిన రాజమండ్రి కోర్ట్, ఏంటంటే.?

By Siva KodatiFirst Published Dec 14, 2022, 4:12 PM IST
Highlights

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రిమాండ్‌లో వున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ బెయిల్‌కు షరతులు విధించింది. 

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్ట్ షరతులు విధించింది. రూ.50 వేలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలాగే సాక్షులతో మాట్లాడటం, బెదిరించడం చేయకూడదని అనంతబాబును హెచ్చరించింది. పాస్‌పోర్ట్ కూడా స్వాధీనం చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్ట్ నిబంధనలు విధించింది. దీనితో పాటు కేసు విచారణ పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లొద్దని అనంతబాబును ఆదేశించింది. 

ఇదిలావుండగా... సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అలియాస్‌ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు స్పందించారు. అనంతబాబు నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతబాబు బయటకు వస్తే ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. 

Also REad:ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదు?: సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

అనంతబాబు మనుషులు అన్ని చోట్ల ఉన్నారని అన్నారు. తమ కుమారుడి హత్యపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చనిపోయిన తన కొడుకును తీసుకురాగరా అని ప్రశ్నించారు. అనంతబాబుకు బెయిల్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. అనంతబాబును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయనను జైలులో పెట్టాలని  కోరారు. ఇప్పటివరకు కేసులో ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అన్నింటికి రుజువులు కనపడుతున్నాయని అన్నారు. 

మే 19న అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఆరోపణలపై మే 22న పోలీసులు అనంతబాబు అరెస్టు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను..  ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు, ఏపీ హైకోర్టు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే అనంతబాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు అధికారి నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేయలేక పోవడం, రాజమండ్రి సెంట్రల్ జైలులో  90 రోజులకు పైగా రిమాండ్ అనుభవించినందున డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే అనంతబాబుకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 2024 మార్చి 14కు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర బెయిల్ అమలులో ఉంటుంది. ఇక, ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. 
 

click me!