Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు: రైల్వే అధికారులు..

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 4:16 PM IST
Highlights

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాలలో దీనిని ఒకటిగా చెబుతున్నారు.  

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాలలో దీనిని ఒకటిగా చెబుతున్నారు.  మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో 261 మంది  మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ప్యాసింజర్ రైళ్లలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌పాస్ట్ రైళ్లు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కువ భాగం దెబ్బతిన్నట్టుగా  చెబుతున్నారు. ఈ రెండు రైళ్లలో కూడా పలువురు తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపు 200 మంది వరకు తెలుగువారు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే రైల్వే శాఖ మాత్రం రిజర్వేషన్ చేయించుకున్న వారి వివరాలను మాత్రమే అందించగలుగుతుంది. జనరల్ బోగీలలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదు. 

ఇక, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలలో స్టాప్‌లు ఉన్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌లో దిగేందుకు రిజర్వేషన్ చేయించుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో అక్కడే చిక్కుకుపోయినవారిని తీసుకురావడానికి దక్షిణ రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చనున్నారు.  

ఒడిశాలోని భద్రక్‌ నుంచి శనివారం ప్రారంభమైన రైలు.. ఆదివారం ఉదయం 9 గంటల చెన్నై చేరుకోనుంది. రైలులో దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. రైలు ప్రమాద ఘటన సంబంధించి ఏపీలోని పలు రైల్వే స్టేషన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. 

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్-040-27788516, విజయవాడ 0866-2576924, సామర్లకోట-7382629990, రాజమండ్రి-0883-2420541, ఏలూరు-08812-232267, తాడేపల్లి గూడెం-08818-226212, బాపట్ల-08643-222178, తెనాలి-08644-227600, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడూరు-0862-4250795, రేణిగుంట-9121272320, 9493548008, తిరుపతి-7815915571, 9346903954 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.

click me!