రాఘవేంద్ర రావు సలహాలు అక్కర్లేదు: పృథ్వీ, పోసానిపైనా కామెంట్

By telugu teamFirst Published Aug 5, 2019, 7:20 AM IST
Highlights

రాఘవేంద్ర రావు స్టయిల్ వేరు, తన స్టయిల్ వేరు అని పృథ్వీ అన్నారు. అయితే, రాఘవేంద్రరావుపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎస్వీబీసీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఆయన చెప్పారు.

హైదరాబాద్: తాను దర్శకుడు రాఘవేంద్ర రావు సలహాలు తీసుకోబోనని శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్ వీబీసీ) చైర్మన్ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ చెప్పారు. ఎస్ వీబీసీ చైర్మన్ గా రాఘవేంద్ర రావు పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేశారు. 

రాఘవేంద్ర రావు స్టయిల్ వేరు, తన స్టయిల్ వేరు అని పృథ్వీ అన్నారు. అయితే, రాఘవేంద్రరావుపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎస్వీబీసీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఆయన చెప్పారు. ఎస్వీబీసీ చైర్మన్ గా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు సినిమా అవకాశాలు పెరిగినట్లు ఆయన తెలిపారు. 

తమ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి 151 సీట్లు చెప్పిన తొలి వ్యక్తిని తానే అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. బిజెపి హవా నడుస్తోందని అన్నారు. 

తనకు ఇలాంటి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు. వైసిపి తనకు రాజకీయ జన్మ ఇచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంచి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. 

తొమ్మిదేళ్ల పాటు పార్టీ అభివృద్ధి కోసం తాను చేశానని, ఆ విషయాన్ని జగన్ గుర్తించారని ఆయన చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మొక్కులు మొక్కుకున్నానని, తిరుమలలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. అమరావతిలో మాత్రమే రాజకీయాలు మాట్లాడుతానని చెప్పారు. 

గతంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తానని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని అన్నారు. నెలలో 20 రోజులు తిరుపతిలో ఉంటానని అన్నారు. తనకు పోసాని కృష్ణమురళితో ఏ విధమైన విభేదాలు లేవని స్పష్టం చేశారు.

click me!