సైకిల్ ని గుద్దిన విజిలెన్స్ వాహనం... వ్యక్తి మృతి.. !

By AN TeluguFirst Published May 17, 2021, 11:24 AM IST
Highlights

గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు గ్రామంలో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని గుంటూరు విజిలెన్స్ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో సైకిల్ మీద వెడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 

గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు గ్రామంలో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని గుంటూరు విజిలెన్స్ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో సైకిల్ మీద వెడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  చనిపోయిన వ్యక్తి నంబూర్ గ్రామానికి చెందిన కూసం బ్రహ్మరెడ్డి, వయస్సు 60 సంవత్సరాలు. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం హాస్పిటల్ లో చనిపోయినట్లు నిర్ధారణ చేశారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడని, అందుకే ఈ దారుణం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన కారును గుంటూరు విజిలెన్స్ ప్రైవేట్ వాహనంగా గుర్తించారు. సైకిల్ కు ఢీ కొట్టిన తరువాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. 

విషయం గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేశారు. పెద్దకాకాని ASI కోటేశ్వరరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకాకని పోలీసులు వివరణ ఇచ్చారు. 

డ్రైవర్ తాగి వాహనం నడిపినట్లు స్థానికులు చెప్పిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే తాగి వాహనాన్ని నడిపాడా లేదా అనేది పరారీలో ఉన్న డ్రైవర్ పట్టుబడిన తరువాత.. తగిన పరీక్షల నిర్ధారణ తరువాతే పూర్తి సమాచారం అందజేయగలం అని తెలిపిన పెద్దకాకని CI సురేష్ బాబు అన్నారు.

కారు నడుపుతున్న డ్రైవర్ ది మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంగా గుర్తించారు. అయితే చనిపోయిన వ్యక్తికి తగు న్యాయం చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో నిందితుడిని వెంటనే పట్టుకుని రేపటి కల్లా కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని పెద్దకాకని CI సురేష్ బాబు వెల్లడించారు. 

click me!