పీఆర్సీ వివాదం.. ఎస్మాకు భయపడం, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటమే: ఏపీ ఉద్యోగ సంఘాలు

Siva Kodati |  
Published : Jan 29, 2022, 08:11 PM IST
పీఆర్సీ వివాదం.. ఎస్మాకు భయపడం, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటమే: ఏపీ ఉద్యోగ సంఘాలు

సారాంశం

ఎస్మా చట్టానికి (esma act) భయపడేది లేదని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చేయొద్దు అన్నారు. ధర్మబద్ధంగా, న్యాయ బద్దంగా ఈ పోరాటం చేస్తున్నామని... మా జీతాల్లో కోతలు వేసుకుని ఆ డబ్బులు మిగుల్చుకుంటున్నారంటూ బొప్పరాజు ఆరోపించారు. 

ఫిబ్రవరి 3న లక్షలాదిమందితో నిర్వహించే చలో విజయవాడను విజయంతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి (ap jac amaravati) ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చలో విజయవాడ కార్యక్రమం చూసైనా ప్రభుత్వం మారాలని హితవు పలికారు. మెరుగైన పీఆర్సీ (prc) కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని బొప్పరాజు తెలిపారు. గత మూడు రోజులు నుండి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.

ఇటీవల మంత్రుల కమిటీ పేరు మీద చర్చలకు పిలిచారు, కానీ ఆ చర్చలకు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు.. జరగని అంశాన్ని, లేని అంశాన్ని ఉద్యోగులకు చెప్పడం కరెక్ట్ కాదని బొప్పరాజు హితవు పలికారు. 9మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లిందని.. లిఖిత పూర్వకంగా మా డిమాండ్స్ ఇచ్చాము అని ఆయన తెలిపారు. వాటికి ఇప్పటివరకు సమాధానమే లేదని... ప్రభుత్వానికి స్పష్టమైన అధికారాలు ఉంటే.. లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాటికి సమాధానం చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.

గత మూడేళ్లుగా పలు దఫాలుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసం పోయామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ నాయకులను తిట్టుకునే పరిస్థితి వచ్చిందని వెంకటేశ్వర్లు అన్నారు. 13 లక్షలు మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు నమ్మకం పోగొట్టుకున్నారని తెలిపారు. అశుతోష్ మిశ్రా నివేదకను బయట పెట్టాలని .. ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టి తయారు చేసిన నివేదికను బయట పెట్టాలని, అది ప్రభుత్వ భాద్యత అని అన్నారు. ఇచ్చిన జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారని... వాటిని సరిదిద్దండి అని బొప్పరాజు కోరారు. 

మీకు భారంగా ఉన్న 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రూ.1800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. సీపీఎస్, పెన్షనర్లకు రావాల్సిన 5 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించాలని కోరారు. 25 కోట్ల హెల్త్ బకాయిలు చెల్లించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. అన్ని విధాల సిద్ధమై ఉద్యమంలోకి దిగామని, ఎవరికీ భయపడేది లేదన్నారు. 

మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చేయొద్దు అన్నారు. ధర్మబద్ధంగా, న్యాయ బద్దంగా ఈ పోరాటం చేస్తున్నామని... మా జీతాల్లో కోతలు వేసుకుని ఆ డబ్బులు మిగుల్చుకుంటున్నారంటూ బొప్పరాజు ఆరోపించారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒక అడుగు ముందుకు వస్తే మేము నాలుగు అడుగులు ముందుకి వేస్తామని  తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తీసుకు రావొద్దని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. మంత్రులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్మా చట్టానికి (esma act) భయపడేది లేదని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu