
హైదరాబాద్: విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణం అని జనసేన మండిపడింది. అనధికార కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటల వరకు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటల వరకు, నగరాల్లో 4 నుంచి ఆరు గంటల వరకు విద్యుత్‌లో కోత పెడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభంపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో హాస్పిటళ్లలో ఆపరేషన్లు, ప్రసవాలు జరుగుతున్న దుస్థితి ఉన్నదని, ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు రాష్ట్రంగా ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే 2014-19 కాలంలో అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. ఒకటి రెండు సందర్భాల్లో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడూ కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భోరుమన్నారని విద్యుత్ భారం మోయలేమని బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. వారి తరఫున ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, అప్పుడు ప్రభుత్వం పెంచిన చార్జీలను వెనక్కి తీసుకుందని తెలిపారు.
అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను (పీపీఏ)లను రద్దు చేసుకుందని పవన్ కళ్యాణ్ వివరించారు. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్లపాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని తెలిపారు. అంతేకాదు, యూనిట్ రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీ తెస్తామని గొప్పలు చెప్పిందని, కానీ, ఇప్పుడు రూ. 20 పెట్టి కోల్ ఎనర్జీని కొంటున్నదని పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు అదే నాయకత్వం 57 శాతం చార్జీలు పెంచిందని ఆరోపించారు. విద్యార్థులు, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు ఈ కరెంట్ కోతలతో సతమతం అవుతున్నారని, పగలంతా తరగతి గదుల్లో గడిపి రాత్రి కూడా ప్రశాంత నిద్ర లేకపోవడంతో ఒత్తిళ్లకు గురవుతున్నారని వివరించారు. ఇళ్లల్లో కరెంటు లేక కొందరు రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో పడుకుంటున్నారని తెలిపారు.
పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని, తాజాగా మరో రోజూ పవర్ హాలీడే ప్రకటించడంతో అవి వారంలో రెండు రోజులు మూతపడనున్నాయని తెలిపారు. నిరంతరం నడిచే పరిశ్రమలు ఇకపై 50 శాతం మాత్రమే వినియోగించాలనే నిబంధన విధించిందని పేర్కొన్నారు. దీంతో యాజమాన్యాలు నష్టాలపాలవ్వడమే కాదు.. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం వేసే అవకాశం ఉన్నదని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులు మొదలు పెరిగిన విద్యుత్ చార్జీ వరకు తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, ప్రజల పక్షాన నిలవడానికే తాము జనసేన పార్టీని స్థాపించామని అన్నారు. ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అలాంటివి ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాల గురించి ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు.