పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం... ఏపి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ

By Arun Kumar PFirst Published May 15, 2020, 10:17 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవో పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

అమరావతి: పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన 203 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చును పెడుతోంది. దీనిపై  తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ వ్యవహారంపై స్పందించింది. 

జీఓ నెంబర్ 203 పై అభ్యంతరం  వ్యక్తం చేస్తూ ఏపి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ రాసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమని లేఖలో పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే కొత్త స్కీం పై బోర్డు వివరణ కోరింది. వెంటనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియచేయాలని రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ కృష్ణా బోర్డు ఆదేశించింది.

 తెలంగాణకు చెందిన అన్ని పార్టీలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదుతో ఈ నెల 13న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం కూడా జరిగింది. 

గురువారం మధ్యాహ్నం కృష్ణా రివర్ బోర్డు ఛైర్మెన్ ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసింది. 203 జీవోపై ఫిర్యాదు చేసింది. తెలంగాణకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కోరారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు.

ఏపీ తీరుతో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ బృందం కృష్ణా బోర్డు ఛైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. 44 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకొంటుందని కాంగ్రెస్ నేతలు ఈ సందర్బంగా చెప్పారు.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు విషయమై జనవరిలోనే తెలిసినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై బోర్డు చైర్మెన్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.

click me!